
- వినియోగదారుల హక్కుల రక్షణకు మార్గదర్శకాలు
హైదరాబాద్, వెలుగు: డైరెక్ట్ సెల్లింగ్ రంగం నియంత్రణ కోసం నిర్దిష్ట మార్గదర్శకాల రూపకల్పనను రాష్ట్రసర్కారు ప్రారంభించింది. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో వ్యాపార పద్ధతుల నియంత్రణ, వినియోగదారుల భద్రతకు అనుగుణంగా చట్టబద్ధ వ్యవస్థను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం జారీ చేసిన కన్జ్యుమార్ ప్రొటెక్షన్ (డైరెక్ట్ సెల్లింగ్) రూల్స్ –2021 ఆధారంగా, కన్జూమర్, సివిల్సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్. చౌహాన్ నేతృత్వంలో ఈ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆయనను నోడల్ అధికారిగా నియమించింది.
ఈ ప్రక్రియలో భాగంగా ఇండస్ట్రీస్, కమర్షియల్ ట్యాక్స్, లీగల్ మెట్రాలజీ, డ్రగ్స్ కంట్రోల్, ఎక్సైజ్, పోలీసు శాఖతోపాటు అసోసియేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటీటీస్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ , ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వంటి జాతీయ పరిశ్రమ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐటీ శాఖ కార్యదర్శి భవేష్ మిశ్రా, వాణిజ్య పన్నుల కమిషనర్ కె. హరిత, సీఐడీ ఎస్పీ కె. వెంకట లక్ష్మి కీలక సూచనలు చేశారు. వినియోగదారుల భద్రత రాజ్యాంగ బాధ్యతని, పారదర్శకత, జవాబుదారీతనం, నమ్మకాన్ని పెంపొందించేలా ఈ మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని కమిషనర్ డీఎస్. చౌహాన్ తెలిపారు.