రైతుల చేతికి సీలింగ్‌‌ భూములు.. సూర్యాపేట జిల్లాలో మూడువేల ఎకరాలు..

రైతుల చేతికి సీలింగ్‌‌ భూములు.. సూర్యాపేట జిల్లాలో మూడువేల ఎకరాలు..
  • నూతనకల్‌‌, మద్దిరాల మండలాల్లో మూడు వేల ఎకరాలు
  • ధరణి లోపాల కారణంగా గల్లంతయిన రైతుల పేర్లు
  • 50 ఏండ్లుగా సాగులో ఉన్నా పట్టాలు రాక ఇబ్బందులు
  • భూ భారతి చట్టంలో ఎంజాయిమెంట్‌‌ కాలమ్‌‌ పునరుద్ధరణతో రైతులకు పట్టాలు 
  • నేటి నుంచి సర్వే స్టార్ట్‌‌ చేయనున్న ఆఫీసర్లు

సూర్యాపేట, వెలుగు:సూర్యాపేట జిల్లా నూతనకల్‌‌, మద్దిరాల మండలాల్లోని సీలింగ్‌‌ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో కాస్తుదారుల కాలమ్ తొలగించడంతో సదరు భూములు సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు కాకుండా.. ఏండ్ల కింద అమ్ముకున్న పట్టాదారుల పేర్లే ఆన్‌‌లైన్‌‌లో కనిపించాయి. 

దీంతో రెండు మండలాల్లోని సుమారు మూడు వేల ఎకరాల భూములను దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్న రైతులు రైతు బంధు, క్రాప్‌‌లోన్లకు దూరమయ్యారు. కాంగ్రెస్‌‌ సర్కార్‌‌ ఇటీవల భూ భారతి చట్టాన్ని అమల్లోకి తేవడం, ఎంజాయ్‌‌మెంట్‌‌ కాలమ్‌‌ పునరుద్ధరించడంతో రైతులకు పట్టాలు ఇచ్చేందుకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు ఆయా మండలాల్లో సోమవారం నుంచి సర్వే చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.

ముగ్గురి పేరిటే 1842 ఎకరాలు..

నిజాం హయాంలో ఎర్రబాడు దొరగా ప్రసిద్ధి చెందిన జెన్నారెడ్డి ప్రతాపరెడ్డికి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో సుమారు లక్షన్నర ఎకరాల భూమి ఉండేది. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో వేలాది ఎకరాలను పేదలకు పంచారు. అనంతరం కౌలు రక్షిత చట్టం, భూసంస్కరణల చట్టం అమల్లోకి రావడంతో ప్రతాపరెడ్డి కుటుంబం కొంత భూమిని అమ్ముకోగా.. మరికొంత భూమిని తమ దగ్గర పని చేసేవాళ్లకు దానంగా ఇచ్చారు. 1972లో భూసంస్కరణల చట్టం అమల్లోకి వచ్చే నాటికే ఆ కుటుంబం వద్ద చట్టప్రకారం ఉండాల్సిన భూములు తప్ప.. మిగతావన్నీ రైతుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. 

అప్పటి రెవెన్యూ రికార్డుల్లోని పట్టాదారు కాలమ్‌‌లో ప్రతాపరెడ్డి భార్య సుభద్రమ్మ, ఆయన కొడుకులు శ్యాంసుందర్‌‌రెడ్డి, సుధీర్‌‌రెడ్డి పేర్లు రాగా... కాస్తుదారుకాలమ్‌‌లో మాత్రం భూములను సాగు చేసుకుంటున్న రైతుల పేర్లే వచ్చాయి. కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో కాస్తుదారుల పేర్లు ఎగిరిపోయి.. పట్టాదారులుగా శ్యాంసుందర్‌‌రెడ్డి, సుధీర్‌‌రెడ్డి, సుభద్రమ్మ పేర్లు వచ్చాయి. ఒక్క శ్యాంసుందర్‌‌రెడ్డి పేరు మీదే 1,533 ఎకరాల భూమి నమోదు కాగా, సుధీర్‌‌రెడ్డి పేరున 174 ఎకరాలు, సుభద్రమ్మ పేరిట 135 ఎకరాలు రికార్డుల్లోకి ఎక్కింది.

రెండు మండలాలు... 9 గ్రామాల్లో...

నూతనకల్‌‌ మండల కేంద్రంలోని 90 సర్వే నంబర్‌‌లో 330.26 ఎకరాలు, చిల్పకుంట్లలోని 132 సర్వే నంబర్‌‌లో 263.24, ఎర్రపహాడ్ (ఎర్రబాడు)లోని ఒకటో ‌‌‌‌‌‌‌‌సర్వే నంబర్‌‌లో 199.33, యడవల్లిలోని 98 సర్వే నంబర్‌‌లో 194.34, గుండ్ల సింగారంలోని 65 సర్వే నంబర్‌‌లో 66, దిర్శనపల్లిలోని 49 సర్వే నంబర్‌‌లో 127.07 ఎకరాలు, మద్దిరాల మండలం చందుపట్లలోని 74 సర్వే నంబర్‌‌లో 272.37 ఎకరాలు, మామిండ్ల మడువలోని 10 సర్వే నంబర్‌‌లో 21.15, ముకుందాపురంలో 57.13 ఎకరాల భూమి శ్యాసుందర్‌‌ రెడ్డి పేరిట నమోదైంది. 

అలాగే నూతనకల్‌‌ మండల కేంద్రంలోని 24 సర్వే నంబర్‌‌లో 128.03 ఎకరాలు, ఎర్రబాడులో 46.17 ఎకరాలు సుధీర్‌‌రెడ్డి పేరిట ఉంది. ఇదే మండలంలోని యడవల్లిలో సుభద్రమ్మ పేరిట 92 సర్వే నంబర్‌‌లో 135 ఎకరాల భూమి ఉన్నట్లు ధరణి రికార్డుల్లో నమోదైంది. ఈ సర్వే నెంబర్లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలోని మరో 1200 ఎకరాల వరకు పట్టా భూములను సైతం ధరణిలో సీలింగ్‌‌ కింద నమోదు చేయడంతో ప్రస్తుతం సాగులో ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎంజాయిమెంట్‌‌ కాలమ్‌‌ పునరుద్ధరణతో రైతులకు పట్టాలు

ధరణిలో ఎంజాయ్‌‌మెంట్‌‌ కాలం ఎత్తివేసి పట్టాదారుకాలం మాత్రమే ఉండడంతో సాగులో ఉన్న రైతులకు పట్టాలు అందలేదు. దీంతో వారు అన్ని రకాల ప్రభుత్వ స్కీమ్‌‌లకు దూరమయ్యారు. తమకు పట్టాలు ఇవ్వాలని ఏండ్ల తరబడి ఆఫీస్‌‌ల చుట్టూ తిరిగినా పట్టించుకోనే వారే కరువయ్యారు. అయితే కాంగ్రెస్‌‌ సర్కార్‌‌ వచ్చాక... ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చి ఎంజామ్‌‌మెంట్‌‌ కాలమ్‌‌ను పునరుద్ధరించింది. దీంతో రైతులకు పట్టాలు ఇచ్చేందుకు మార్గం సుగమం అయింది. 

ఇయ్యాల్టి నుంచి గ్రామాల్లో సర్వే

ప్రభుత్వ ఆదేశాలతో సోమవారం నుంచి నూతనకల్, మద్దిరాల మండలాల్లో సర్వే చేపట్టనున్నారు. ఆయా మండలాల్లోని గ్రామాల నుంచి సాదా బైనామా, రెవెన్యూ సదస్సుల్లో సుమారు 6,500 అప్లికేషన్లు వచ్చాయి. దీంతో రెండు మండలాల్లో సర్వే చేపట్టాలని నిర్ణయించిన ఆఫీసర్లు ఇందుకోసం 16 టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో మండలంలో ఎనిమిది టీమ్‌‌లు 45 రోజుల పాటు సర్వే చేయనున్నారు. ఒక్కో టీంలో తహసీల్దార్‌‌, నాయబ్‌‌ తహసీల్దార్‌‌, ఆర్ఐ, సీనియర్‌‌ అసిస్టెంట్, సర్వేయర్లు, గ్రామ పాలనాధికారులను నియమించారు. సర్వే అనంతరం భూములను రెగ్యులరైజ్‌‌ చేసి అర్హులైన రైతులకు డిజిటల్‌‌ పాస్‌‌ పుస్తకాలు జారీ చేయనున్నారు.

ఈ రోజు నుంచి సర్వే 

నూతనకల్‌‌, మద్దిరాల మండలాల్లో గ్రామాల వారీగా 45 రోజుల పాటు సర్వే నిర్వహిస్తాం. ఇందుకోసం 16 టీమ్‌‌లను ఏర్పాటు చేశాం. సర్వే పూర్తి చేసి శాశ్వత హక్కులు కల్పించనున్నారు. చట్టబద్ధత కల్పించడంతో పాటు, భూ రికార్డులను డిజిటలైజేషన్‌‌ చేసేందుకు భూ భారతి చట్టం- ప్రకారం  సాదా దస్తావేజు భూములను రెగ్యులరైజ్‌‌ చేసి అర్హులైన రైతులకు డిజిటల్ పాస్‌‌ పుస్తకాలు అందిస్తాం

- తేజస్‌‌ నంద్‌‌లాల్‌‌ పవార్‌‌, కలెక్టర్‌‌, సూర్యాపేట