
- గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం/చంద్రుగొండ, వెలుగు : పేదలకు భరోసా, ఆత్మగౌరవం, భద్రత కల్పించడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ప్రోగ్రాంలో సీఎంతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం దామరచర్లలో ఏర్పాటు చేసిన సభలో పొంగులేటి మాట్లాడారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చామని, ఏజెన్సీ ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు అదనంగా 1,500 ఇండ్లు ఇచ్చామని చెప్పారు. చెంచులు, ఆదివాసీల కోసం 13 వేల ఇండ్లను మంజూరు చేశామన్నారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ప్రతి ఒక్కరికీ డబుల్ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ తర్వాత మోసం చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాసాలమర్రి గ్రామానికి 119 ఇండ్లు మంజూరు చేశామని, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ప్రతి సోమవారం లబ్ధిదారుల అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.