
ముదిగొండ, వెలుగు : ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సోమవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ మధిర నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. శాశ్వత అభివృద్ధి ప్రణాళికలో భాగంగా.. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాజెక్ట్‌లను స్పీడ్‌గా పూర్తి చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని ఆఫీసర్లను ఆదేశించారు.
ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డుల జారీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. పేదల సొంతింటి కల సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందన్నారు.
గురుకులాల్లో చదివే పిల్లలకు మెరుగైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచామని గుర్తు చేశారు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, పీఆర్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ పాల్గొన్నారు.