
- రాష్ట్రంలో 8,721కి చేరిన లబ్ధిదారుల సంఖ్య
- ఆరోగ్య భద్రత కోసమే ఆర్థిక భరోసా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 681 మంది డయాలసిస్ పేషెంట్లకు చేయూత పింఛన్ మంజూరు చేసింది. ఫైల్‌పై మంత్రి సీతక్క సోమవారం సంతకం చేశారు. అంతకు ముందు రాష్ట్రవ్యాప్తంగా 4,011 మంది డయాలసిస్ పేషెంట్లు మాత్రమే పింఛన్ మంజూరైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4,029 మంది డయాలసిస్ పేషెంట్లకు కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. తాజాగా మరో 681 మంది పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేయగా.. లబ్ధిదారుల సంఖ్య 8,721కి చేరింది.
గుర్తింపు పొందిన వివిధ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా చికిత్స పొందుతున్న పేషెంట్ల వివరాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ట్రస్ట్ గుర్తించిన 681 మంది డయాలసిస్ పేషెంట్ల వివరాలను సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) సాంకేతికంగా పరిశీలించి ఎంపిక చేసింది. కాగా, హైదరాబాద్ లో 629 మంది పేషెంట్లు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ పొందుతున్నారు. మిగిలిన 52 మంది పేషెంట్లు ఇతర జిల్లాలకు చెందినవారు. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచి చేయూత పెన్షన్ అందనుంది. ఆరోగ్య భద్రత కోసమే ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.