హైకోర్టు స్టేపై సుప్రీంలో సవాల్.. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ పిటిషన్‌‌

హైకోర్టు స్టేపై  సుప్రీంలో సవాల్.. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ పిటిషన్‌‌
  • బీసీ రిజర్వేషన్లపై  దాదాపు 50 పేజీలతో 
  •  ఆన్‌‌లైన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేసిన రాష్ట్ర సర్కార్‌‌‌‌ 
  • న్యాయ నిపుణులు, సీనియర్ అడ్వకేట్లతో చర్చించాకే ముందడుగు 
  • సీఎం రేవంత్‌‌ డైరెక్షన్.. డిప్యూటీ సీఎం, ఇతర మంత్రుల పర్యవేక్షణలో ఫైలింగ్
  • రిఫరెన్స్‌‌గా ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసు
  • రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావన
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ శాస్త్రీయంగానే చేపట్టామని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు:స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవో  9 పై హైకోర్టు స్టే విధించడాన్ని  సవాల్ చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50 పేజీలకుపైగా సమగ్రమైన సమాచారంతో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా.. హైకోర్టు తీర్పు ఆర్డర్ రిలీజ్ కాగా.. అందులోని అంశాలపై కూలం కషంగా న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 

ఇందులో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతోపాటు తాజాగా హైకోర్టులో జరిగిన వాదనలు, తీర్పు కాపీని పిటిషన్‌‌కు జత చేసింది. ప్రధానంగా రిజర్వేషన్ల పెంపులో కీలకమైన ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ తీర్పును రిఫరెన్స్‌‌గా పిటిషన్‌‌లో పేర్కొన్నట్లు సమాచారం.  

ఈ తీర్పు ప్రకారం.. రిజర్వేషన్లు 50 శాతం క్యాప్ దాటొద్దని చెబుతున్నా.. అది కేవలం విద్యా, ఉపాధి రంగాలకే పరిమితం అని ప్రభుత్వం వాదించనున్నది. అందువల్ల రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని పిటిషన్‌‌లో ప్రస్తావించినట్లు తెలిసింది. అలాగే, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కేసులు, తీర్పులను ప్రస్తావించింది.

అంతా శాస్త్రీయంగానే..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్లుగానే శాస్త్రీయంగా జరిగిందని పిటిషన్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది.  బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందు ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించిందని తెలిపింది. కులాలవారీగా శాస్త్రీయంగా సర్వే నిర్వహించిందని, అందులో బీసీ జనాభా 57.6 శాతంగా ఉండటంతో ఆ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ చేసిన సిఫారసులను రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తూ తీర్మానం చేసిందని వివరించింది. 

ఆ తర్వాతే 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో పెట్టిన బిల్లు ఏకగ్రీవంగా పాస్ అయిందని తెలిపింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపుతోపాటు 50 రిజర్వేషన్ల క్యాప్‌‌ను ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణ బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌‌లో  ఉన్నాయని పేర్కొన్నది. అయితే, తమిళనాడు కేసులో గవర్నర్‌‌‌‌కు పంపిన బిల్లు లేదా ఆర్డినెన్స్ నిర్ధిష్ట వ్యవధిలోగా ఆమోదించడమో, తిరస్కరించడమో చేయకపోతే అవి ఆమోదం పొందినట్లు పరిగణించాలని తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. తెలంగాణ అసెంబ్లీలో చేసిన బిల్లులకు వర్తిస్తుందని ప్రస్తావించినట్లు తెలిసింది. 

ఈ ఉత్తర్వుల ప్రకారం..  ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయాల్సిన అవసరం లేదని, అందుకే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జీవో 9 ని తీసుకువచ్చిందని తెలిపింది. పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో జరిగిన ఈ విధానాన్ని.. వేరే రాష్ట్రాలతో పోల్చుతూ ఆపడం సరికాదని పిటిషన్‌‌లో పేర్కొన్నది. కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అలాగే, ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌‌లో అభ్యర్థించింది. 

ఈ వారం బెంచ్ ముందుకు వచ్చేలా..

ఈ వారంలో పిటిషన్‌‌ను బెంచ్ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం ముందు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో మెన్షన్ చేయనున్నది. అక్కడ కూడా ప్రతికూలత ఏర్పడితే.. సీజేఐ బెంచ్ ముందు ఈ పిటిషన్ గురించి మెన్షన్ చేయాలని ఆలోచన చేస్తున్నది. లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్, పలువురు నామినేషన్లు దాఖలు, హైకోర్టు స్టే లాంటి అంశాలను ప్రస్తావిస్తూ పిటిషన్ విచారణ అవసరాన్ని వివరించే ఆస్కారం ఉంది. కాగా.. జీవో 9 ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన బీ మాధవరెడ్డి, మరొకరు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. 

ఈ రిజర్వేషన్ల వ్యవహారంలో ప్రభుత్వంతోపాటు మరెవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు.