
- విచారణకు స్వీకరించిన అపెక్స్ కోర్టు
హైదరాబాద్, వెలుగు: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్ ను కోర్టు స్వీకరించిన తర్వాత దానిపై విచారణ చేయనున్నది. పదవీ విరమణకు ఐదేండ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న టీచర్లు తమ సర్వీస్‌ను కొనసాగించాలంటే, ఉత్తర్వుల తేదీ నుంచి రెండేళ్లలోపు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలని గత నెల ఒకటో తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ప్రమోషన్లకూ టెట్ క్వాలిఫై కావాల్సిందేనని వెల్లడించింది. దీనిపై టీచర్ల సంఘాలు తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కొత్తగా విధుల్లో చేరిన వారికే టెట్ వర్తిస్తుందని, సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయారు.
ఈ క్రమంలోనే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు టెట్‌పై రివ్యూ పిటిషన్ వేయాలని డిసైడ్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుతో విధుల్లో కొనసాగాలంటే 45 వేల మంది, ప్రమోషన్లు పొందాలంటే 60 వేల మంది టీచర్లు టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది.