కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్‌ చేయాలని సర్కారు నిర్ణయం

కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్‌ చేయాలని సర్కారు నిర్ణయం
  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని సర్కారు నిర్ణయం
  • రాష్ట్రంలో 5 లక్షల నుంచి 6 లక్షల కోతులు.. జిల్లాల వారీగా కేంద్రాలు
  • కోతుల నియంత్రణపై ఆఫీసర్లతో మంత్రుల సమీక్ష

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో కోతుల నియంత్రణకు ఫ్యామిలీ ప్లానింగ్​అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కోతుల కుటుంబ నియంత్రణకు జిల్లాల వారీగా కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు శుక్రవారం అరణ్య భవన్ లో మంత్రులు నిరంజన్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్​ రెడ్డితో కలిసి అటవీశాఖ, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో రివ్యూ ​నిర్వహించారు. రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల కోతులు ఉన్నట్టు అంచనా వేస్తున్నామని, ప్రతి జిల్లాలో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రులు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కోతుల ఫ్యామిలీ ప్లానింగ్​నిర్వహణకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కోతులతో పంటలకు తీవ్రంగా నష్టం జరుగుతోందన్నారు. చేతికొచ్చిన పంటలను కోతుల దండు నాశనం చేస్తుంటే రైతులు మనోవేదనకు గురవుతున్నారని, వారిని ఇబ్బంది నుంచి గట్టెక్కించాలన్నారు. కోతుల నియంత్రణకు చట్టపరిధిలో ఉండే ఇతర అవకాశాలను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలనూ అధ్యయనం చేయాలన్నారు.

అడవులు, జాతీయ రహదారులపై పండ్ల మొక్కలను ప్రతి సీజన్ కు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల్లో పండ్ల మొక్కలు తప్పనిసరిగా పెంచాలని సూచించారు. రాష్ట్రంలో కోతుల నియంత్రణకు గతంలోనే కమిటీ ఏర్పాటు చేశామని, ఇప్పటికే పలు అంశాలపై అధ్యయనం జరుగుతోందన్నారు. కోతుల బెడద నివారించాలంటే కోతుల గణన, వాటి వల్ల రైతులకు జరుగుతున్న నష్టం అంచనా వేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 8 మంది అధికారుల కమిటీతో మంత్రులు చర్చించారు.ఈ సమావేశంలో కోతుల బెడద నివారణ కమిటీ కన్వీనర్ రఘునందన్ రావు, పీసీసీఎఫ్(సోషల్ ఫారేస్ట్రీ)ఆర్.యం. దొబ్రియాల్, సీఎఫ్ హైదరాబాద్ ఎం.జే అక్బర్, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.