పదేండ్లుగా ఆగిపోయిన పహాణీ రికార్డుల నిర్వహణను కొత్త సంవత్సరంలో మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అందులో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ‘భూ భారతి’ చట్టం ప్రకారం గ్రామాల్లోని రెవెన్యూ రికార్డులను ఓపెన్ చేసి.. ప్రస్తుతం సాగులో ఎవరున్నారు? ఎంత విస్తీర్ణం? అనే వివరాలతో పాటు.. అసలు ఆ భూమి రైతుకు ఏ రకంగా సంక్రమించింది? అనే కీలక సమాచారాన్ని కూడా నమోదు చేయనున్నారు.
సాగుదారుడికి గుర్తింపు..
భూమి పట్టాదారు ఒకరైతే.. దానిని సాగు చేస్తున్నది మరొకరు కావడం గ్రామాల్లో సర్వసాధారణం. పదేండ్లుగా పహాణీలు రాయకపోవడంతో వాస్తవ సాగుదారుల వివరాలు రికార్డుల్లో నమోదు కావడం లేదు. ఇప్పుడు ప్రతి సర్వే నంబర్లో ప్రస్తుతం ఎవరున్నారు? యజమానే సాగు చేస్తున్నారా? లేక కౌలుకు ఇచ్చారా? అనేది రాస్తారు. పట్టాదారు పాస్ పుస్తకంలో పేరున్నా సరే, క్షేత్రస్థాయిలో సాగులో ఉన్న వ్యక్తి పేరును కూడా ‘అనుభవదారుడి’ కాలమ్ లో చేర్చడం ద్వారా ప్రభుత్వ పథకాలు, పంట నష్ట పరిహారం, ఇన్సూరెన్స్ వంటివి అర్హులైన వారికే అందే అవకాశం కలుగుతుంది. అలాగే, భూమి భౌతిక స్థితిని కూడా ఈ కొత్త పహాణీల్లో కూలంకషంగా పొందుపరచనున్నారు. అది సాగునీటి వసతి ఉన్న మాగాణి భూమా? వర్షాధార మెట్ట భూమా? లేక సాగుకు పనికిరాని రాళ్లూ రప్పలతో ఉన్న బీడు భూమా? అనే వివరాలు నమోదు చేస్తారు. అలాగే, ఆ సీజన్ లో రైతు ఏ పంట వేశారనేది కూడా రికార్డు చేస్తారు. గతంలో మాదిరి కాకుండా వాణిజ్య పంటలు, ఉద్యానవన తోటల వివరాలను కూడా సేకరిస్తారు. ఈ సమగ్ర డేటా వల్ల ప్రభుత్వానికి పంటల దిగుబడిపై స్పష్టత రావడంతో పాటు, మార్కెటింగ్ ప్రణాళికలు వేయడానికి సులువు అవుతుంది.
సివిల్ తగాదాలు, సరిహద్దు గొడవలకు పరిష్కారం
గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం గొడవలు భూమి హక్కుల కోసమే జరుగుతుంటాయి. ముఖ్యంగా భూమి ఎలా వచ్చిందనే దానిపై స్పష్టత లేక దాయాదుల మధ్య గొడవలు, సరిహద్దు వివాదాలతో కోర్టుల మెట్లు ఎక్కుతారు. ఇప్పుడు పహాణీలోనే ‘మోడ్ ఆఫ్ అక్విజిషన్’ (సంక్రమణ విధానం) రాయడం వల్ల, ఆ భూమిపై హక్కు ఎవరిదో సులభంగా తేలిపోతుంది. న్యాయస్థానాలు కూడా ప్రాథమిక సాక్ష్యంగా పరిగణించే పహాణీ రికార్డు పక్కాగా ఉండటంతో, సివిల్ కేసుల పరిష్కారం లో వేగం పెరుగుతుంది. రైతులకు ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది.
