సాగర్ ఆయకట్టుపై ఏపీ కుట్రలు ..ఆయకట్టులో అక్రమంగా మార్చిందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం

సాగర్ ఆయకట్టుపై ఏపీ కుట్రలు ..ఆయకట్టులో అక్రమంగా మార్చిందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం
  • ఎడమ కాల్వ కింద తెలంగాణకు తగ్గించి ఏపీకి పెంచుకున్నరు
  • బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం వాదనలు
  • 1954 ఏపీ, హైదరాబాద్ ఒప్పందానికి విరుద్ధంగా ఏపీ చర్యలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టేలా నాగార్జునసాగర్​ కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులో ఏపీ అక్రమ మార్పులు చేసిందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏకపక్షంగా పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకున్నదని పేర్కొన్నది.

 బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2) ముందు గురువారం తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ సీఎస్.వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఏపీ, హైదరాబాద్ స్టేట్ మధ్య 1954లో చేసుకున్న ఒప్పందం ప్రకారం నాగార్జునసాగర్ కుడి కాల్వ ఆయకట్టు 9.7 లక్షల ఎకరాలేకాగా.. ఏపీ అక్రమంగా దాన్ని  11.74 లక్షల ఎకరాలకు పెంచుకున్నదని తెలిపారు. అంతేగాకుండా, తెలంగాణకు సంబంధించి ఎడమ కాల్వ ఆయకట్టును ఉమ్మడి ఏపీలో 6.6 లక్షల ఎకరాల నుంచి 6.02 లక్షల ఎకరాలకు కుట్రపూరితంగా కుదించిందన్నారు. 

రెండో పంటకు 1.2 లక్షల ఎకరాలను ఆయకట్టు నుంచి తొలగించారని తెలిపారు. తెలంగాణ ఆయకట్టును తగ్గించి నీటి వాడకాన్ని ఉద్దేశపూర్వకంగానే 111 టీఎంసీల నుంచి 100 టీఎంసీలకు కుదించి కుట్రలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఎడమ కాల్వ కింద తెలంగాణ ఆయకట్టును తగ్గించిన నాటి ఉమ్మడి పాలకులు.. అదే ఏపీలో మాత్రం 1.3 లక్షల ఎకరాల నుంచి 3.78 లక్షల ఎకరాలకు పెంచుకున్నారని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. 

నీటి వాడకాన్ని 20.7 టీఎంసీల నుంచి 32.25 టీఎంసీలకు ఏపీ పాలకులు పెంచుకున్నారన్నారు. ఆ రెండు కాల్వల కింద ఏపీ 164.2 టీఎంసీల నీటిని వాడేసుకుంటున్నదని, కానీ.. ఏపీ ఆయకట్టుకు శాస్త్రీయంగా 84.64 టీఎంసీలు సరిపోతాయని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్​ పళనిస్వామి, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్​ జీఎస్.ఝాల అఫిడవిట్​లు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.

చెన్నైకి నీటి తరలింపులంటూ.. శ్రీశైలానికి గండి

చెన్నైకి నీటి తరలింపుల చాటున శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ భారీ గండినే పెట్టిందని తెలంగాణ అడ్వకేట్లు వాదించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు మేరకు శ్రీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుదుత్పత్తి ప్రాజెక్టేనన్నారు. ‘‘చెన్నైకి నీటి తరలింపుల పేరిట 1976–77లో 1,500 క్యూసెక్కులను తరలించుకునేందుకు వీలుండేది. కానీ, ఆ అగ్రిమెంట్​ను ఏపీ తొక్కిపెట్టింది.  11,150 క్యూసెక్కులను నీటిని తరలించుకునేందుకు 1980లో పోతిరెడ్డి హెడ్​ రెగ్యులేటర్​, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టింది. 

2006లో 44 వేల క్యూసెక్కులకు వాటి సామర్థ్యాన్ని పెంచింది. 2020లో దానిని రెండింతలు చేసింది. పోతిరెడ్డిపాడు వద్ద ఉన్న 4 పాత గేట్లకు తోడు.. కొత్తగా 10 వెంట్లను ఏర్పాటు చేసింది. మొత్తంగా 14 వెంట్ల ద్వారా 1.56 లక్షల క్యూసెక్కులను తరలించుకుపోయేలా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఏపీ విసర్తించింది. 

ఒక్క ఏడాదిలో చెన్నైకి తాగునీటి కోసం 15 టీఎంసీలను తరలించాల్సిన ఒప్పందానికి విరుద్ధంగా.. ఒకే రోజు ఆ రాష్ట్రం 15 టీఎంసీలను తన్నుకుపోయేలా పోతిరెడ్డిపాడును నిర్మించడం దారుణం. దానికి తోడు రోజూ 3 టీఎంసీలు తీసుకెళ్లడానికి కొత్తగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్​నూ ఆ రాష్ట్రం చేపడుతున్నది. కానీ, ఇప్పటికే కేటాయింపులున్న ప్రాజెక్టులకే నీటిని తీసుకెళ్లేందుకు ఆ లిఫ్ట్​ను చేపడుతున్నట్టు ఏపీ తప్పుదోవ పట్టిస్తున్నది. 

రెండు రాష్ట్రాలకు హక్కు వాటా వచ్చేంత వరకు ఏపీ ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టకుండా ట్రిబ్యునల్ చూడాలి’’అని అడ్వకేట్లు వాదించారు. కాగా, పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్ వద్ద టెలీమెట్రీలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముందుకొస్తున్నా ఏపీ మాత్రం ససేమిరా అంటున్నదని, టెలీమెట్రీలు పెడితేనే ఏపీ ఎంత తీసుకెళ్తున్నదో తెలుస్తుందని స్పష్టం చేశారు.