- లర్నింగ్ బై డూయింగ్.. వారంలో 2 రోజులు క్లాసులు..4 రోజులు ఇంటర్న్‌షిప్
- విజన్ 2047 డాక్యుమెంట్లో సర్కారు ప్రణాళిక
- ప్రతి స్టూడెంట్‌కు‘స్కిల్ ఐడీ’.. ఆధార్‌తో లింక్
- హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ రేంజ్లో ‘ఎడ్యు-సిటీ’
హైదరాబాద్, వెలుగు: ‘చదువు అంటే పుస్తకాలు బట్టీపట్టుడు కాదు. చదువుతో పాటు పని కూడా నేర్చుకోవాలె. డిగ్రీ పట్టా చేతికి రాగానే జాబ్ చేసేందుకు రెడీగా ఉండాలె’ ఇదీ తెలంగాణ సర్కారు ఎడ్యుకేషన్ కొత్త ప్లాన్. దీనికి అనుగుణంగానే తెలంగాణ విజన్ –2047 డాక్యుమెంట్లో ప్రణాళిక రెడీ చేసింది. రాష్ట్రంలోనూ జర్మనీ మోడల్ చదువులు అమలు చేయాలని నిర్ణయించింది. పారిశ్రామిక, సేవా రంగాలకు ఏది అవసరమో అదే నేర్పించేలా కొత్త విద్యావిధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. జర్మనీలో క్లాస్‌రూమ్‌లో పాఠాలు ఎంత ముఖ్యమో.. పని కూడా అంతే ముఖ్యం. అక్కడి డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ విధానాన్ని అడాప్ట్ చేసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇదే మోడల్‌ను అమలు చేయాలని డిసైడ్ అయింది.
దీని ప్రకారం స్టూడెంట్లు వారంలో 3 నుంచి 4 రోజులు ఇండస్ట్రీలో పని (అప్రెంటిస్‌షిప్) చేసి మిగతా 2, 3 రోజులు మాత్రమే కాలేజీలో క్లాసులు వినాలి. తద్వారా చదువు అయిపోయేసరికి విద్యార్థులకు పనిలో అనుభవం కూడా రావలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఉదాహరణకు సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి వారంలో నాలుగు రోజులు రోడ్లు, బిల్డింగులు, ప్రాజెక్టుల నిర్మాణ స్థలంలో పనిచేసి అనుభవం సాధిస్తాడు. సర్టిఫికెట్ చేతికి వచ్చేసరికే నౌకరీ కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటారని, ఇలాంటి వారికి స్థానికంగానే కాక విదేశాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయని సర్కారు భావిస్తోంది. తొలుత 10 ఆక్యుపేషన్స్ (5 మ్యానుఫాక్చరింగ్ + 5 సర్వీసెస్) కంపెనీలను ఎంచుకొని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని యోచిస్తోంది. ఫిన్ లాండ్ మోడల్ లో భాగంగా జీవితంలో ఎప్పుడైనా పని నేర్చుకునే విధానం అమలుపైనా నిర్ణయం తీసుకోనుంది.
ఆధార్ లెక్కనే ‘స్కిల్ ఐడీ’
ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డులాగా ఒక ‘స్కిల్ ఐడీ’ ఇవ్వనున్నారు. దీన్ని ఆధార్ నంబర్‌తో లింక్ చేస్తారు. ఒక స్టూడెంట్ టెన్త్ పాసైనా, ఐటీఐ చేసినా, ఏదైనా చిన్న కోర్సు నేర్చుకున్నా.. ఆ వివరాలన్నీ ఈ ఐడీలో నిక్షిప్తం చేయనున్నారు. దీన్ని ‘అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్’ కు అనుసంధానం చేస్తారు. తద్వారా ఒక విద్యార్థి ఎక్కడ ఏ స్కిల్ నేర్చుకున్నా అది తన ఖాతాలో పాయింట్ల లెక్క యాడ్ అవుతుది.
మాస్ యాక్సెస్ నుంచి మాస్ ఎక్సలెన్స్‌కు
ఇప్పటిదాకా అందరికీ చదువు (మాస్ యాక్సెస్) అనే కాన్సెప్ట్ ఉంది. ఇక నుంచి అందరికీ క్వాలిటీ చదువు (మాస్ ఎక్సలెన్స్) అనే టార్గెట్‌తో విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. రీయింబర్స్మెంట్ స్థానంలో.. ఇన్‌కం కంటింజెంట్ ఫైనాన్స్ సిస్టమ్ తెచ్చే ఆలోచనలో ఉన్నారు. అంటే ఉద్యోగం వచ్చి, సంపాదన మొదలుపెట్టాకే చదువు అప్పు తీర్చే వెసులుబాటు కల్పించబోతున్నారు. ఈ విధానం ఆస్ర్టేలియా, బ్రిటన్ లో అమల్లో ఉంది. దీన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో ‘ఎడ్యు–సిటీ’
హైదరాబాద్‌ను చదువుల ఖిల్లాగా మార్చేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ప్రత్యేకంగా సిటీని ఎడ్యు సిటీగా మార్చనున్నారు. దీన్ని రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ కు అడ్డాగా తయారు చేయాలని సర్కారు ప్రణాళికలు రెడీ చేసింది. పెద్ద వర్సిటీలు, ఇండస్ర్టీలు, స్టార్టప్‌లు అన్నీ ఒకే దగ్గరకు తీసుకురానుంది. ప్రధానంగా డీప్–టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ వంటి రంగాల్లో ఇక్కడ రీసెర్చ్ జరగనున్నది. ప్రపంచంలోనే టాప్ కంపెనీలు ఇక్కడికి వచ్చి మనోళ్లకు ట్రైనింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
