గోదావరి బోర్డుకు తేల్చి చెప్పిన తెలంగాణ

గోదావరి బోర్డుకు తేల్చి చెప్పిన తెలంగాణ
  • ఏకపక్షంగా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటారా? అని ప్రశ్న
  • తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు స్వాధీనం చేస్కోవాలన్న ఏపీ

హైదరాబాద్​, వెలుగు: గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగు తప్ప ఇంకే ప్రాజెక్టును గోదావరి బోర్డుకు అప్పగించేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. తమకు కనీసం మాటైనా చెప్పకుండా ప్రాజెక్టుల స్వాధీనానికి నోట్స్​ ఎలా తయారు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం బీపీ పాండే నేతృత్వంలో జీఆర్​ఎంబీ (గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డ్​) సబ్​ కమిటీ ఆరో మీటింగ్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ, కన్నెపల్లి పంపుహౌస్​, ఏపీలోని వెంకటనగరం పంపింగ్​ స్కీంపై ఈ సమావేశంలో చర్చించారు. 

బోర్డు గెజిట్​లో పేర్కొన్న 11 ప్రాజెక్టుల్లోని ఐదు ప్రాజెక్టులు, మరికొన్ని కాంపోనెంట్లను షెడ్యూల్​- 2 నుంచి షెడ్యూల్​-3లోకి మార్చాల్సిందిగా బోర్డుతో పాటు కేంద్ర జలశక్తి శాఖను కోరామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తమ విజ్ఞప్తిపై బోర్డు, కేంద్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదని, కాబట్టి ఆ ప్రాజెక్టుల గురించి చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2021 అక్టోబర్​ 11న నిర్వహించిన బోర్డు 12వ సమావేశంలో ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టును ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని, ఆ ప్రాజెక్టు పూర్తి సమాచారం ఇప్పటికే బోర్డుకు అందజేశామని వివరించింది. ప్రాజెక్టుల విజిట్ సహా అన్ని అంశాలనూ బోర్డు మీటింగ్​లో చర్చకు పెట్టాలని, కానీ, అందుకు విరుద్ధంగా బోర్డు సెక్రటేరియట్​ సభ్యులు చెప్పాపెట్టకుండా ప్రాజెక్టులను పరిశీలించి వాటిని అప్పగించేందుకు ఏకపక్ష నిర్ణయాలతో మినిట్స్​ను రూపొందిస్తున్నారని విమర్శించింది. సబ్​కమిటీ ఐదో మీటింగ్​లో తమ అభిప్రాయాలను మినిట్స్​లో చేర్చలేదని, వాటన్నింటినీ మినిట్స్​లో చేర్చాలని సూచించింది. 

‘వెంకటనగరం’ ఇచ్చేందుకు ఏపీ ఓకే 

ఏపీలోని వెంకటనగరం పంపింగ్​ స్టేషన్​ను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ సర్కారు అంగీకారం తెలిపింది. తమ ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులనూ స్వాధీనం చేసుకోవాలని కోరింది. దీన్ని తెలంగాణ తీవ్రంగా తప్పు బట్టింది. తమ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని స్పష్టం చేసింది. బచావత్​ అవార్డులోని నాలుగో క్లాజు ప్రకారం తమ వాటా నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించుకునే హక్కు ఉందని తేల్చి చెప్పింది. అలాంటప్పుడు తమ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని కోరడం సమంజసం కాదని పేర్కొంది.