రుణమాఫీ కోసం 10 వేల కోట్ల అప్పు!

రుణమాఫీ కోసం 10 వేల కోట్ల అప్పు!
  • వచ్చే నెలలో తీసుకోనున్న ప్రభుత్వం 
  • ఇప్పటికే ఆర్బీఐకి అధికారుల విజ్ఞప్తి
  • మిగతా నిధులు ఇతర మార్గాల్లో సమకూర్చుకోవాలని నిర్ణయం 
  • రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరం 

హైదరాబాద్, వెలుగు: రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రుణమాఫీకి దాదాపు రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా, ఆ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై దృష్టిసారించింది. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని మాటిచ్చిన ప్రభుత్వం.. వచ్చే నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ముందుగానే పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో  ఉంచుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రెగ్యులర్​గా ప్రతి నెల తీసుకునే అప్పుల మొత్తాన్ని కొంతమేర పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వచ్చే నెలలో రూ.10 వేల కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆర్బీఐని కూడా కోరినట్టు సమాచారం. ఇక రుణమాఫీకి అవసరమైన మిగతా నిధులను ఇతర ఆదాయ మార్గాల ద్వారా సమకూ ర్చుకోవాలని సర్కార్ భావిస్తున్నది. ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖాపెట్టి లోన్లు తీసుకోవడంతో పాటు ప్రతినెల వచ్చే రాబడిలో కొంతమేర వినియోగించుకోవాలని అనుకుంటున్నది. ముఖ్యమైన పథకాల అమలుకు ఇబ్బంది లేకుండానే రైతు రుణమాఫీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది. అయితే, ఒకేసారి రూ.31 వేల కోట్లు సమకూర్చుకోవడం చిన్న విషయం కాదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ఓవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలు, వడ్డీలు చెల్లించుకుంటూ.. ఇంకోవైపు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేయడం గొప్ప విషయమేనని పేర్కొంటున్నారు.

అవసరమైతే మరో 5 వేల కోట్లు! 

ప్రస్తుతం అన్ని రాష్ట్రాల మాదిరే తెలంగాణ ప్రతి నెల ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్​బీఎం పరిధిలో అప్పులు తీసుకుంటున్నది. ఏడాది మొత్తానికి నిర్దేశించుకున్న అప్పుల్లో నుంచి నెలకు కొంత మొత్తం తీసుకుంటున్నది. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.60 వేల కోట్లు ఎఫ్ఆర్​బీఎం పరిధిలో తీసుకునే చాన్స్ ఉంది. ఇందులో ఇప్పటికే ప్రభుత్వం రూ.12 వేల కోట్లు తీసుకున్నది.

అంటే మూడు నెలల్లో యావరేజ్​గా ప్రతి నెల రూ.4 వేల కోట్లు తీసుకున్నది. ఈ లెక్కన మిగిలిన 9 నెలల్లో రూ.48 వేల కోట్ల మేర అప్పు చేసే అవకాశం రాష్ట్రానికి ఉన్నది. ప్రతి క్వార్టర్​కు ఎంత మొత్తంలో అప్పు తీసుకుంటామనే దానిపై ఆర్బీఐకి ప్రభుత్వం ముందుగానే ఇండెంట్​ఇస్తుంది. జూన్​తో ఫస్ట్​క్వార్టర్​ముగియనుంది. రెండో క్వార్టర్​జులై నుంచి మొదలవుతుంది. దీంతో వచ్చే నెలలో రూ.10 వేల కోట్ల మేర అప్పు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే విషయాన్ని ఆర్బీఐకి ఆర్థిక శాఖ అధికారులు విన్నవించినట్టు తెలుస్తున్నది.

అవసరమైతే జులై చివర్లో లేదా ఆగస్టు మొదటి వారంలో మరో రూ.5 వేల కోట్లు కూడా ఆర్బీఐ నుంచే తీసుకోవాలనే ప్లాన్ ఉన్నది. వీటన్నింటినీ రుణమాఫీకి ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. ఇవి కాకుండా ప్రభుత్వానికి వివిధ రకాలుగా వచ్చే సొంత ఆదాయాన్ని కూడా వాడుకోనుంది. ఇక భూముల తనఖా విషయంలోనూ ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ప్రైవేట్​బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకోనుంది. ఇతర మార్గాల్లోనూ నిధులు సర్దుబాటు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.