
- 454 దుకాణాలు మూసివేయాలని సర్కార్ యోచన
- ఇప్పటికే ఎక్సైజ్ శాఖ నుంచి నివేదిక
- కల్తీ కల్లు నివారించేందుకు చర్యలు
హైదరాబాద్, వెలుగు: కల్తీ కల్లును నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న కల్లు దుకాణాలను ఎత్తివేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నుంచి అవసరమైన వివరాలను సేకరించినట్లు సమాచారం. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు ఓఆర్‌ఆర్ లోపల ఎన్ని కల్లు దుకాణాలు ఉన్నాయి? వీటిని ఎత్తివేస్తే కల్తీ కల్లు నివారణ సాధ్యమేనా? అనే అంశాలపై సర్కార్ దృష్టిపెట్టినట్లు తెలిసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని మల్కాజిగిరి, మేడ్చల్, షాద్‌నగర్, సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలోని కల్లు దుకాణాలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కూకట్‌పల్లి ఘటనలో 10 మంది చనిపోవడంతో కల్తీ కల్లు నివారణకు సర్కార్ చర్యలు చేపట్టింది.
2004లో కల్తీ కల్లు ఘటన జరిగినప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని కల్లు దుకాణాలను మూసివేయించారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్లీ కల్లు దుకాణాలు తెరిచారు. ఓఆర్‌ఆర్ లోపల టాడీ కోఅపరేటివ్ సొసైటీలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌లో 14 సంఘాల పరిధిలో 53 కల్లు దుకాణాలు, సికింద్రాబాద్‌లో 31 సంఘాల పరిధిలో 50, మల్కాజిగిరిలో 77 సంఘాల పరిధిలో 79, మేడ్చల్‌లో 50 సంఘాల పరిధిలో 52 కల్లు దుకాణాలు, సరూర్‌నగర్‌లో 158 సంఘాల కింద 158, శంషాబాద్ పరిధిలో 60 సంఘాల కింద 62 దుకాణాలు ఉన్నాయి.
మొత్తం 390 సంఘాల కింద 454 కల్లు దుకాణాలు ఉన్నాయని ప్రభుత్వానికి ఎక్సైజ్‌శాఖ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. వీటితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా మేడ్చల్, మల్కాజిగిరి, శంషాబాద్, సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న టీఎఫ్‌టీ (టీ ఫర్ ట్రేడ్) లైసెన్స్‌లు కూడా రద్దు అయ్యే అవకాకాలు ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ కింద 6, సికింద్రాబాద్ కింద 6, రంగారెడ్డి కింద 21 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని కల్లు దుకాణాలు క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.