మైనింగ్‌‌‌‌ సీనరేజీ పైసలిస్తలే..తొమ్మిదేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదు

మైనింగ్‌‌‌‌ సీనరేజీ పైసలిస్తలే..తొమ్మిదేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదు
  • తొమ్మిదేళ్ల నుంచి ఒక్క రూపాయి ఇవ్వని సర్కార్‌‌‌‌
  •  మీటింగ్‌‌‌‌లలో నిలదీస్తున్న ప్రజాప్రతినిధులు
  •  సర్కారే ఇవ్వడం లేదని చేతులెత్తేస్తున్న ఆఫీసర్లు
  •  నిధుల కొరతతో ఆగిపోతున్న అభివృద్ధి పనులు

జనగామ, వెలుగు : గ్రామ, మండల, జిల్లా పరిషత్‌‌‌‌లకు మైనింగ్ శాఖ నుంచి దక్కాల్సిన సీనరేజీ నిధులను సర్కార్‌‌‌‌ స్వాహా చేస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగనామం పెడుతోంది. ఈ నిధులపై పలు మీటింగ్‌‌‌‌లలో ప్రజాప్రతినిధులు నిలదీసినా ఆఫీసర్ల నుంచే ఎలాంటి సమాధానం ఉండడం లేదు. గ్రామ పంచాయతీలకు మైనింగ్‌‌‌‌ సీనరేజ్‌‌‌‌ డబ్బులే ప్రధాన ఇన్‌‌‌‌కం. రూల్స్‌‌‌‌ ప్రకారం మైనింగ్‌‌‌‌ శాఖ వసూలు చేసే ట్యాక్స్‌‌‌‌ నుంచి గ్రామ పంచాయతీలకు 25 శాతం, మండల పరిషత్‌‌‌‌లకు 50, జిల్లా పరిషత్‌‌‌‌లకు 25 శాతం నిధులు ఇవ్వాలి. ఈ నిధులను సర్కారే విభజించి ఎప్పటికప్పుడు పంచాయతీలు, పరిషత్‌‌‌‌ల అకౌంట్లలో జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో నిధుల కొరతతో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు.

జనగామ జిల్లా నుంచే రూ. 60 కోట్ల ఇన్‌‌‌‌కం

మైనింగ్‌‌‌‌ పర్మిషన్లు, లీజు రెన్యూవల్స్‌‌‌‌, ఖనిజ అక్రమ రవాణ కేసులు, ట్యాక్స్‌‌‌‌ వసూలు, ఫైన్లు వేయడం వల్ల మైనింగ్‌‌‌‌ శాఖ నుంచి సర్కార్‌‌‌‌కు ప్రతి ఏడాది కోట్లాది రూపాయల ఇన్‌‌‌‌కం వస్తోంది. జనగామ జిల్లాలో 8 బ్లాక్‌‌‌‌ గ్రానైట్, 5 కలర్‌‌‌‌ గ్రానైట్‌‌‌‌, 14 స్టోన్‌‌‌‌ అండ్‌‌‌‌ మెటల్‌‌‌‌ గ్రానైట్‌‌‌‌ కలిపి మొత్తం 27 ఇండస్ట్రీలు పని చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పటినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క జనగామ జిల్లా నుంచే ట్యాక్స్​రూపంలో రూ.49.73 కోట్ల ఇన్‌‌‌‌కం వచ్చింది. దీంతో పాటు ఖనిజ అక్రమ రవాణాకు సంబంధించి 1,025 కేసులు నమోదు చేసి ఫైన్ల రూపంలో రూ.11.01 కోట్లు వసూలు చేశారు. ఈ నిధులను పంచాయతీలు, పరిషత్‌‌‌‌లకు పంచకుండా సర్కార్‌‌‌‌ సొంతానికి వాడుకుంటోంది. సీనరేజీ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఇటీవల జరిగిన జనగామ జడ్పీ మీటింగ్‌‌‌‌లో రఘునాథపల్లి జడ్పీటీసీ బొల్లం అజయ్‌‌‌‌ ఆఫీసర్లను నిలదీశారు. దీంతో సర్కార్‌‌‌‌ నుంచే నిధులు విడుదల కావడం లేదని ఆఫీసర్లు స్పష్టం చేశారు. 

రేట్ల పెంపుపైనే ఇంట్రస్ట్‌‌‌‌

సీనరేజీ ఇన్‌‌‌‌కంను పంచడంలో నిర్లక్ష్యం చేస్తున్న సర్కార్‌‌‌‌ మైనింగ్‌‌‌‌ ధరలను మాత్రం ఇష్టారాజ్యంగా పెంచుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 2015 సెప్టెంబర్‌‌‌‌లో ఓ సారి, 2022 మార్చిలో మరోసారి రేట్లను పెంచుతూ జీవోలు జారీ చేసింది. వెలికి తీసే ఖనిజం ఆధారంగా మెట్రిక్​టన్నుకు రూ.25 నుంచి  నుంచి వేల రూపాయల వరకు ట్యాక్స్‌‌‌‌ వసూలు చేస్తున్నారు. బిల్డింగ్‌‌‌‌ స్టోన్‌‌‌‌ ఒక మెట్రిక్​ టన్నుకు గతంలో రూ.50 ఉండగా 2022లో రూ.65కు పెంచారు. డైమెన్షనల్​స్టోన్​(రాతి), మార్బుల్‌‌‌‌కు రూ.100 ఉండగా రూ.130కి పెంచారు. చిప్స్‌‌‌‌కు రూ.45 ఉంటే దానిని రూ. 58కి పెంచారు. గ్రానైట్‌‌‌‌ రకాల ఆధారంగా సీనరేజీ వసూలు చేస్తున్నారు. అయితే సర్కార్‌‌‌‌ ఖజానాను నింపుకోవడంలో ఉన్న ఆసక్తి పంచాయతీలపై ఎందుకు లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలోనైనా పంచాయతీలు, పరిషత్‌‌‌‌లకు రావాల్సిన అమౌంట్‌‌‌‌ను అకౌంట్లలో డిపాజిట్ చేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.