ఇరిగేషన్ శాఖలో ప్రక్షాళన..106 మంది అధికారుల ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌

ఇరిగేషన్ శాఖలో ప్రక్షాళన..106 మంది అధికారుల ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌
  • ఒకేసారి 106 మంది అధికారుల ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌
  • ఒక్క హైదరాబాద్​ పరిధిలోనే 50 మందికిపైగా బదిలీ
  • చెరువుల ఎఫ్‌‌‌‌టీఎల్, బఫర్​ జోన్లలో అక్రమంగా
  • ఎన్‌‌‌‌వోసీలు ఇచ్చినందుకు సర్కారు యాక్షన్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ శాఖలో సర్కారు ప్రక్షాళన చేపట్టింది. ఒకేసారి 106 మంది ఇంజనీర్లను బదిలీ చేసింది. హైదరాబాద్​ పరిధిలో చెరువుల ఎఫ్‌‌‌‌టీఎల్, బఫర్‌‌‌‌‌‌‌‌ జోన్లలో నిర్మాణాలకు అడ్డగోలుగా నో ఆబ్జెక్షన్‌‌‌‌ సర్టిఫికెట్లు (ఎన్‌‌‌‌వోసీ) జారీ చేసి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై చర్యలు తీసుకున్నది. హైదరాబాద్​పరిధిలోనే 50 మందికిపైగా అధికారులను ట్రాన్స్‌‌‌‌ఫర్​ చేస్తూ ఇరిగేషన్​ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇద్దరు ఎస్‌‌‌‌ఈలు, ఒక డిప్యూటీ సీఈ, ఐదుగురు ఈఈలు, 38 మంది డీఈఈలు, 60 మంది ఏఈఈలను బదిలీ చేశారు. హైదరాబాద్‌‌‌‌తోపాటు నల్గొండ, సంగారెడ్డి, నాగర్​కర్నూల్, సూర్యాపేట, మెదక్​, భువనగిరి, కోదాడ, గజ్వేల్, చేవెళ్ల, మక్తల్, మహబూబ్​నగర్, పెబ్బేరు, సిద్దిపేట, కామారెడ్డి, కాగజ్​నగర్​ పరిధిలోని అధికారులనూ ట్రాన్స్‌‌‌‌ఫర్​ చేస్తూ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్​ పరిధిలోని అధికారులను ఆయా సర్కిళ్ల పరిధిలో అడ్జస్ట్​ చేశారు. 

కాగా, వారితోపాటు ఇద్దరు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. బెల్లంపల్లి ఎస్ఈగా పనిచేస్తున్న బి. విష్ణుప్రసాద్‌‌‌‌కు కాగజ్‌‌‌‌నగర్​ ఎస్ఈగా, హుజూర్​నగర్​ డీఈఈ రామ కిశోర్​ సానపాకు హుజూర్​నగర్​ ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. 

హైదరాబాద్​ అధికారులపై ఎన్నో ఆరోపణలు

హైదరాబాద్​ పరిధిలోని చెరువులు చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. హైదరాబాద్, లేక్, చేవెళ్ల సర్కిళ్లలో ఏండ్ల తరబడి అధికారులు తిష్ట వేసుకుని కూర్చుని.. చెరువుల్లో నిర్మాణాలకు అక్రమంగా ఎన్‌‌‌‌వోసీలు ఇచ్చారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ సీఈ పరిధిలో పనిచేస్తున్న డిప్యూటీ సీఈ పుష్కర్​ కుమార్‌‌‌‌‌‌‌‌ను ట్రాన్స్‌‌‌‌ఫర్​ చేస్తూ రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రభుత్వానికి రిపోర్ట్​ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సర్కిళ్లలోని అధికారులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. వారిని అక్కడి నుంచి తప్పించి.. వేరే చోటుకు బదిలీ చేసింది. కొన్నేండ్లుగా హైదరాబాద్​ సీఈ పరిధిలో చెరువులు, కుంటల ఆక్రమణకు పలువురు అధికారులు అడ్డగోలుగా సహకరించారన్న ఆరోపణలున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న విమర్శలూ వెల్లువెత్తాయి. 

రాష్ట్ర విభజనకు ముందు జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్​ పరిధిలో 920 వరకు చెరువులు ఉండేవి. అందులో అప్పటికే అక్రమార్కులు 225 చెరువులను పూర్తిగా, 196 చెరువులను పాక్షికంగా ఆక్రమించేశారని నివేదికలు స్పష్టం చేశాయి. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక ఈ పదేండ్లలో మరో 44 చెరువులనూ కబ్జాదారులు చెరపట్టేశారు. మరో 127 చెరువుల్లోని బఫర్​ జోన్ల వరకు వెళ్లి భారీ బిల్డింగులు నిర్మించారు. వెంచర్లూ వేశారు. అలా ఈ పదేండ్లలో మరో 171 చెరువులు కనుమరుగయ్యాయి. ఈ ఆక్రమణల విలువ దాదాపు రూ.30 వేల కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా.

చెరువులను ఆక్రమించి విల్లాలు, భారీ బిల్డింగులు

చెరువులను చెరబట్టి పలువురు భారీ బిల్డింగులు, వెంచర్లలో విల్లాలు నిర్మించారన్న ఆరోపణలున్నాయి. పుప్పాలగూడ, మోకిలా, నార్సింగి, గోపనపల్లి, హైటెక్​ సిటీ సహా పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. అక్కడ నిర్మాణాలకు ఎన్‌‌‌‌వోసీ ఇచ్చేందుకు హైదరాబాద్​ పరిధిలోని ఇంజనీర్లు భారీగా అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ఎన్​వోసీల జారీ కోసం వందల కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపించాయి. వీటిపై సమగ్రంగా విచారణ జరిపిస్తే అక్రమార్కుల బాగోతం బట్టబయల వుతుందని ఇరిగేషన్​ శాఖ వర్గాలు అంటున్నాయి.