వ్యాక్సిన్ వేసుకోనోళ్లకు నో ఎంట్రీ!

వ్యాక్సిన్ వేసుకోనోళ్లకు నో ఎంట్రీ!
  • హైదరాబాద్‌‌‌‌లో ఈ నెలాఖరు నుంచి అమలు చేసే చాన్స్
  • వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ ఉండాల్సిందే
  •  ప్రభుత్వానికి హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రతిపాదన
  • గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో 95 శాతం మందికి కనీసం సింగిల్ డోస్
  • మిగతా 5% మందికి వారంలో పూర్తి చేసేందుకు ప్లాన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా ఆంక్షలు ఎత్తేసిన సర్కార్‌‌‌‌.. వ్యాక్సినేషన్‌‌‌‌ ఆంక్షలు అమలు చేయాలని భావిస్తోంది. వ్యాక్సిన్‌‌‌‌ వేయించుకున్న వాళ్లను మాత్రమే హోటళ్లు, మాల్స్, పార్కులు, పబ్బులు, థియేటర్లు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి అనుమతివ్వాలని యోచిస్తోంది. టీకా వేయించుకోని వాళ్లకు ‘నో ఎంట్రీ’ ఆంక్షలు పెట్టే ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రతిపాదనలు పంపింది. 

తొలుత గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లో దీన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకే గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో బస్తీలు, కాలనీలు తిరుగుతూ వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌‌‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ 95 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగిలిన ఐదు శాతం మందికి కూడా టీకా వేసేందుకు మున్సిపల్, హెల్త్ స్టాఫ్ తిరుగుతున్నారు. ఈ నెల 9వ తేదీ నాటికి గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ల కోసం మరో 15 రోజుల గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాతి నుంచి ఆంక్షలు అమలు చేయనున్నట్టు సమాచారం. ఆంక్షలు అమలు చేయడానికి వారం రోజుల ముందే అధికారికంగా ప్రకటిస్తామని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు.

జిల్లాలపై ఎఫెక్ట్

గ్రేటర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో 95 శాతం మంది కనీసం ఒక్క డోసు అయినా వేసుకున్నారు. కానీ జిల్లాల్లో ఇప్పటికీ 80 లక్షల మంది కనీసం ఒక్క డోసు కూడా వేసుకోలేదు. చాలా మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుకాడుతున్నారు. వ్యాక్సిన్ సెంటర్లలో ఇంతకుముందులా రద్దీ ఉండడం లేదు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో రిస్ర్టిక్షన్స్‌‌‌‌ అమలు చేస్తే.. జిల్లాల్లో జనాలు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకొస్తారని అధికారులు భావిస్తున్నారు. దసరా నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేయాలని హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌, అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో కలిపి తెలంగాణకు కోటి పది లక్షల డోసులను కేంద్రం కేటాయించింది. జనాలు ముందుకొస్తే దసరా నాటికి వంద శాతం (సింగిల్ డోసు) వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని ఆఫీసర్లు చెబుతున్నారు.

10 లోగా టీచర్లందరికీ వ్యాక్సిన్ వేయాలె: సీఎస్

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్​ టీచింగ్​ స్టాఫ్​కు ఈ నెల 10వ తేదీలోగా వ్యాక్సినేషన్​ పూర్తి చేయాలని సీఎస్​ సోమేశ్​ కుమార్​ ఆదేశించారు. ఈ మేరకు శనివారం వైద్యారోగ్య, విద్యాశాఖ ఆఫీసర్లకు ఉత్తర్వులిచ్చారు. 18 ఏండ్లు పైడిన స్టూడెంట్స్​కు టీకా ఇవ్వాలని, అన్ని విద్యా సంస్థలు వందశాతం వ్యాక్సినేషన్​ను పూర్తి చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్​ కోసం స్థానిక పీహెచ్​సీలు, మెడికల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలని, ఈ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సర్కారు ఓకే చెబితే ఈ నెల్లోనే

గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లో వంద శాతం వ్యాక్సినేషన్‌‌‌‌కు చేరువలో ఉన్నాం. 95 శాతం మందికి ఇప్పటికే వ్యాక్సిన్ ఇచ్చాం. రాబోయే వారం రోజుల్లో వంద శాతానికి చేరుకుంటాం. తర్వాత సెకండ్‌‌‌‌ డోసు వాళ్ల కోసం వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకే పబ్లిక్ ప్లేసుల్లోకి పర్మిట్ చేయాలని భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సర్కారు ఓకే చెబితే గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో ఈ నెలాఖరు నుంచే రెస్ట్రిక్షన్స్ అమలు చేస్తాం. జిల్లాల్లో వ్యాక్సినేషన్‌‌‌‌ను స్పీడప్ చేసేందుకు మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నాం.
- డాక్టర్​ శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్