- వైద్యం అందని బ్లాంక్ స్పాట్స్ ఆధారంగా కొత్త హాస్పిటల్స్ ఏర్పాటు
- రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలు లేకుండా జనాభా, దూరమే ప్రామాణికం
- డాక్టర్లు, ల్యాబ్ సేవలపై ఆడిట్.. రెఫరల్ నెట్‌వర్క్ పక్కాగా ఉండేలా ప్లాన్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లాలాపేటలోని ఓ గల్లీలో అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఎదురెదురుగా ఉన్నాయి. మొన్నటివరకు సేవలు అందించిన రెండింటిలో ఒకటి ప్రస్తుతం కొత్త నిర్మాణంలో ఉండగా, పక్కనే మరొకటి నడుస్తోంది. మరోవైపు భద్రాచలం, ములుగు వంటి ఏజెన్సీ ఏరియాల్లోని పలు గిరిజన గూడేలకు పది కిలోమీటర్ల మేర వెతికినా ఒక్క పీహెచ్‌సీ కూడా కనిపించదు. ఏండ్ల తరబడి పేరుకుపోయిన ఈ అస్తవ్యస్త విధానానికి స్వస్తి పలికేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,600 సబ్ సెంటర్లు, 890 పీహెచ్‌సీలు, 185 సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటల్స్, 35 మెడికల్ కాలేజీల సమగ్ర జియో మ్యాపింగ్ చేపట్టింది.
ఇకపై బ్లాంక్ స్పాట్స్ ఆధారంగానే..
గతంలో శాస్త్రీయ పద్ధతి లేకుండా కేవలం రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలతో దూరంతో సంబంధం లేకుండా హాస్పిటల్స్ మంజూరు చేయడం, స్థాయి పెంచడం చేశారు. దీంతో చాలాచోట్ల వైద్యసేవల అందుబాటులో వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. ఈ లోపాలను సరి దిద్దేందుకు.. సర్కారు దవాఖానల మ్యాపింగ్ చేపడుతున్నారు అధికారులు. ఈ మ్యాపింగ్ ఆధారంగానే వైద్య సేవలు అందని బ్లాంక్ స్పాట్స్ ను గుర్తిస్తారు. ఏ సెంటర్ లో ఎంత మంది డాక్టర్లు, సిబ్బంది, టెస్టులు అందుబాటులో ఉన్నాయనే సమచారాన్ని కూడా సేకరించి అప్డేట్ చేయనున్నారు. ఇకపై ఎక్కడైనా సబ్ సెంటర్, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా హాస్పిటల్ నిర్మించాలన్నా.. కేవలం జనాభా, భౌగోళిక దూరం, మ్యాపింగ్ లో తేలిన గ్యాప్ లను బట్టే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ప్రైమరీ నుంచి సూపర్ స్పెషాలిటీ దాక..
ప్రస్తుత మ్యాపింగ్ లో ప్రతి గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని సమగ్ర విశ్లేషణ చేస్తున్నారు. ఆ ఊరికి ప్రాథమిక చికిత్స నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు ప్రతి హాస్పిటల్ ఎంత దూరంలో ఉందనేది డిజిటల్ గా లెక్కిస్తున్నారు. ఇక్కడ జిల్లా సరిహద్దులను మాత్రమే చూడకుండా, పక్క జిల్లాలోని సమీప పెద్ద దవాఖాన దగ్గరగా ఉంటే ఆ దూరాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. కేవలం హాస్పిటల్స్, గ్యాప్స్ మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న డాక్టర్లు, ల్యాబ్ టెస్టులు, ఎక్విప్మెంట్ స్థితిగతులపై హెల్త్ డిపార్ట్‌మెంట్ పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహిస్తోంది. ఎంబీబీఎస్ డాక్టర్లు, గైనకాలజిస్టులు, సర్జన్లు, పీడియాట్రీషియన్లు, అనస్థీషియా వంటి స్పెషలిస్టులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో డేటా సేకరిస్తున్నారు. దీంతో డాక్టర్ల సర్దుబాటు కూడా సులభం కానుంది.
రెఫరల్ పక్కాగా ఉండేలా డిజిటల్ రూటింగ్..
ఎమర్జెన్సీ సమయాల్లో పేషంట్లను ఆ హాస్పిటల్స్ చుట్టూ తిప్పే ఇబ్బందులను తప్పించేలా రెఫరల్ వ్యవస్థను ఈ మ్యాపింగ్ ద్వారా పటిష్టం చేస్తున్నారు. పీహెచ్‌సీ స్థాయిలోనే పేషంట్ పరిస్థితిని బట్టి ఐసీయూ, వెంటిలేటర్ ఉన్న సమీప ఏరియా హాస్పిటల్ కు లేదా మెడికల్ కాలేజీకి నేరుగా రిఫర్ చేసే వీలుంటుంది. రోడ్ యాక్సిడెండ్లు, ఎమర్జెన్సీలో 108 అంబులెన్స్ లు పేషంట్ ను అత్యంత వేగంగా, దగ్గర్లోని సరైన దవాఖానకు చేర్చేలా డిజిటల్ రూటింగ్ వ్యవస్థను అనుసంధానించనున్నారు.
ప్రస్తుతం జిల్లాల్లో ఈ జియో మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోందని వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మ్యాపింగ్ పూర్తయితే సర్కార్ వైద్యం అన్ని ప్రాంతాలకు ప్రైమరీ నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు.. సమంగా అందుతుందని వైద్య అధికారులు అభిప్రాయపడుతున్నారు.
