
- చిన్న యూనిట్లకు లక్ష్యం ఎక్కువ .. అప్లికేషన్లు తక్కువ
- పెద్ద యూనిట్లకు లక్ష్యం తక్కువ.. డిమాండ్ ఎక్కువ
- 2 రోజుల్లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి కమిటీకి
కామారెడ్డి, వెలుగు : నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో కామారెడ్డి జిల్లాకు టార్గెట్ 13,447 యూనిట్లు కాగా, అప్లికేషన్లు 44,662 వచ్చాయి. జిల్లాలో చిన్న యూనిట్ల కంటే పెద్ద యూనిట్లకు పోటీ అధికంగా ఉంది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, అప్లయ్ చేసుకున్న వారికి బ్యాంక్‌ల అంగీకారం వంటి ప్రక్రియ పరిశీలన సాగుతోంది.
రూ. లక్ష లోపు ఉన్న చిన్న యూనిట్లకు లక్ష్యం ఎక్కువగా ఉంటే అప్లికేషషన్ల తక్కువగా వచ్చాయి. లక్ష్యం తక్కువ ఉన్న రూ. 2 లక్షల వంటి పెద్ద యూనిట్లకు అప్లికేషన్లు ఎక్కువ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రూ. లక్ష లోపు యూనిట్లకు అప్లయ్ చేసుకున్నవారికి పోటీ లేదు. వీరిలో అర్హత ఉన్న వారిలో దాదాపు అందరూ సెలక్ట్ అయ్యే వీలుంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన మొత్తం టార్గెట్ యూనిట్లు 13,447 కాగా, ఆయా వర్గాల నుంచి 44,662 అప్లికేషన్లు వచ్చాయి. రూ.50 వేలు, రూ. లక్ష లోపు యూనిట్లకు అప్లికేషన్లు తక్కువగా రాగా, రూ. 2 లక్షలకు పైగా యూనిట్లకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.
మండల స్థాయి కమిటీ పరిశీలన ఫైనల్‌కు..
అప్లికేషన్ల పరిశీలన, లబ్ధిదారుల సెలక్షన్ కోసం మండల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్‌గా ఎంపీడీవో, మెంబర్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు, సంబంధిత మండల పరిధిలోని బ్యాంకర్లు ఉన్నారు. వీరు తమ పరిధిలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. స్కీమ్‌కు సెలక్ట్ అయ్యే వారు గత 5 ఏండ్లుగా ప్రభుత్వ పరంగా ఆయా కార్పొరేషన్ల నుంచి సబ్సిడీ లోన్లు పొంది ఉండరాదని ఆఫీసర్లు తెలిపారు. రూ. 50వేల లోపు యూనిట్లకు బ్యాంకర్ల ఆమోదం అవసరం లేదు. రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న యూనిట్లకు బ్యాంకర్లు లోన్ ఇచ్చేందుకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది.
రూ. లక్ష లోపు ఉన్న యూనిట్లకు సులభంగా ఆమోదం పొందే వీలున్నప్పటికీ, రూ.లక్షకు పైగా ఉండే వాటికి బ్యాంకర్లు లోన్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపితే మంజూరు సులభం కానుంది. ఎంపీడీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లు బ్యాంకర్లతో చర్చిస్తున్నారు. అప్లయ్ చేసుకున్న వ్యక్తి వివరాలను బ్యాంకర్లతో అధికారులు చర్చిస్తున్నారు. మండల స్థాయిలో 2 రోజుల్లో ఫైనల్ లిస్టు కానుంది. ఇప్పటికే 90 శాతానికి పైగా అప్లికేషన్ల పరిశీలన కంప్లీట్ అయ్యింది. 26 తర్వాత జిల్లా స్థాయి కమిటీ ఈ లిస్టును పరిశీలించి ఫైనల్ చేసి జిల్లా ఇన్చార్జి మంత్రికి పంపుతారు. లిస్టు మొత్తం ఫైనల్ అయిన తర్వాత ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2 న మంజూరు పత్రాలు అందజేస్తారు.
అర్హులను గుర్తిస్తున్నాం
రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లికేషన్ల పరిశీలన మండల స్థాయిలో చివరి దశకు వచ్చింది. ఇక్కడి నుంచి జిల్లాస్థాయికి లిస్టు వచ్చిన తర్వాత పరిశీలన చేసి ఫైనల్ చేస్తాం. ఇప్పటికే బ్యాంకర్లకు తగిన సూచనలు చేశాం. - సురేందర్, డీఆర్డీవో- కామారెడ్డి
యూనిట్ కేటగిరి అప్లికేషన్లు లక్ష్యం
రూ. 50వేల వరకు 1118 4373
రూ.50 నుంచి రూ. లక్ష లోపు 2971 3309
రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు 8537 2835
రూ.2 లక్షల నుంచి రూ. 4 లక్షలు 32,036 2930