కొనుగోలు లేట్ .. మార్కెట్లకు దండిగా వస్తున్న వడ్లు

కొనుగోలు లేట్ .. మార్కెట్లకు దండిగా వస్తున్న వడ్లు
  • ఊపందుకుంటున్న వరి కోతలు
  • సర్కారు కొనుగోళ్ల పై జాప్యం 
  • యాసంగిలో 95 వేల ఎకరాల్లో వరి సాగు
  • 2.10 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం

జనగామ, వెలుగు: సర్కారు వరిధాన్యం కొనుగోళ్లపై ప్రతి సీజన్ లాగే ఈ సారి కూడా జాప్యం చేస్తోంది.  యాసంగి కోతలు మొదలయ్యి, వడ్లు మార్కెట్​యార్డులకు తరలివస్తున్నా, ప్రభుత్వ కొనుగోలు చేయకపోవడంతో, ప్రజలు ప్రైవేట్​ను ఆశ్రయిస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని అగ్రికల్చర్​ మార్కెట్​కు వేలాది క్వింటాళ్ల ధాన్యం ఇప్పటికే వచ్చి చేరింది. ఈ క్రమంలో సెంటర్లు త్వరగా ఏర్పాటు చేయకపోతే నష్టపోవడం ఖాయమని రైతులు అంటున్నారు. 

95 వేల ఎకరాల్లో సాగు..

జిల్లాలో యాసంగి వరిసాగు సాధారణ విస్తీర్ణం 1,31,209 ఎకరాలు కాగా, 95,610 ఎకరాల్లో రైతులు పంట వేసినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. గత సీజన్​తో పోలిస్తే ఈ సీజన్ రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. వాతావరణం అనుకూలించక పంటలు ఏపుగా పెరగలేదు. 
పైగా భూగర్భజలాలు అడుగంటి పలుచోట్లు పంటలు ఎండిపోయాయి. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. 

మరింత లేట్..

జిల్లాలో 95 వేల ఎకరాల్లో వరిపంట సాగవగా, 2.10 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించాలని ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 190 కొనుగోలు సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 52లక్షల50 వేల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, 30లక్షల 30 వేల 485 బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి సమకూర్చుకోవాల్సి ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ధాన్యం కొనుగోలు సెంటర్ల ప్రారంభించనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ముందుగా మండలానికి ఒక సెంటర్​ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఎక్కువ సెంటర్లను ప్రారంభించేలా ప్లాన్​ చేస్తున్నారు. గత సీజన్​లో సెంటర్లు ప్రారంభించాక పది రోజుల తదుపరి కాంటాలు షురూ అయ్యాయి. ఈ సారి అలా జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 

సెంటర్లు లేక తక్కువ ధరకే..  

సర్కారు కొనుగోలు సెంటర్లు లేక పలువురు రైతులు ప్రైవేటుకు అమ్ముకోక తప్పడం లేదు. సర్కారు మద్దతు ధర ఏ గ్రేడ్ క్వింటాల్ కు రూ.2203 ఉండగా, కామన్ రకానికి రూ.2183 గా ఉంది. ప్రైవేటులో రూ.1500 నుంచి రూ.1900 వరకు ధర ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో గురువారం జనగామ అగ్రికల్చర్ మార్కెట్​లో 83 మంది రైతులకు చెందిన 5826 బస్తాల వడ్లను (3786.90 క్వింటాళ్లు) కొనుగోలు చేశారు.

గరిష్టంగా రూ.1988, కనిష్టంగా రూ.1509 ధర పలికింది. మరో వారంలో కోతలు మరింత ముమ్మరం అయ్యే చాన్స్​ ఉంది. కాగా, మొదట్లో మార్కెట్​యార్డుల్లో, ప్రైవేటు కొనుగోళ్లలో కాస్త పరవాలేదన్న విధంగా ధరలు వేస్తున్నప్పటికీ, ధాన్యం రాక పెరిగితే వ్యాపారులంతా ఏకమై ధరలను ఒక్కసారిగా తగ్గించడం ప్రతీ సీజన్​లో జరుగుతున్నది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. ఈ సారైనా ఆఫీసర్లు త్వరగా సర్కారు కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.