అనర్హులకు అందలం..రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు

అనర్హులకు అందలం..రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు

శాసన మండలి గవర్నర్ కోటాలో ఇద్దరు సభ్యులను నామినేట్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి పంపిన సిఫారసులను గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ తిరస్కరించడం జరిగింది. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంలోనూ పాడి కౌశిక్ రెడ్డిని  ఇదే కోటాలో  సిఫారసు చేసినప్పుడు అనర్హత  కారణంగానే తిరస్కరించడం జరిగింది. రాష్ట్రంలో శాసన మండలికి, జాతీయ స్థాయిలో రాజ్యసభకు మేధావుల సభ, పెద్దల సభ అని పేరు కూడా ఉంది. అందుకే గవర్నర్ అభిప్రాయపడ్డట్టుగా వివిధ రంగాల్లో నిష్ణాతులై,  ప్రజల మన్ననలు పొంది, ఉన్నత విలువలు కలిగి, సమాజ హితం కోరే రాజనీతిజ్ఞులకు ఈ పెద్దల సభలో పదవులు దక్కాలి. 

డూ డూ బసవన్నలు, తిమింగలాలకు సంతర్పణ చేసేటివి పదవులు కావని ప్రజాస్వామ్యవాదులకు తెలిసిందే. మన బంగారు తెలంగాణ పేరుతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న రకరకాల నియామకాలు, సిఫారసులు, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కేవలం ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుల విషయంలోనే కాకుండా వివిధ రాజ్యాంగ సంస్థల్లో కూడా ప్రభుత్వ నియామకాలు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించిందని ప్రజల నిరసన గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇతర శాఖల్లో, సంస్థల్లో అదే తీరు కొనసాగుతుంది. అనేక నిర్ణయాలపై న్యాయస్థానాల్లో దావాలు వేశారు. గతంలో న్యాయస్థానాల మందలింపులు, మొట్టికాయలు వేయడం కూడా జరిగాయి.  ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా కాలేదు. 

రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు 

ప్రజాస్వామ్య విలువలకు, సామాజిక న్యాయానికి, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా అర్హత లేనివారిని. భజనపరులకు, అవినీతి, ఆర్థిక దోపిడీకి సహకరించినవారికి తమ సామాజిక, బంధువర్గాలకు పెద్ద పీట వేశారు. కార్పొరేట్ దోపిడీ చేసేవారికి ఇసుక దందాలు, మైనింగ్ మాఫియాలకు పదవులు దక్కుతున్నాయని బహిరంగ రహస్యం. సర్ఫేకాస్ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, నాయకులకు దోచిపెట్టిన  విశ్రాంత అధికారులకు  పదవుల పందేరంలో  గుర్తింపు లభించటం జగమెరిగిన సత్యం. కుటుంబ పాలన స్థిరీకరించడానికి ప్రతిపక్ష పార్టీల నుంచి లొంగిపోయిన నాయకులకు  అనేక నిరర్థకమైన కార్పొరేషన్ల చైర్మన్ల పదవులతో  నింపినారు. వీరంతా అధికార పదవులను అడ్డం పెట్టుకొని ప్రజలను వివిధ రంగాల్లో నిలువు దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు ప్రజాభిప్రాయం. కార్పొరేషన్లకు నిధులు ఉండవు,  గత తొమ్మిది ఏండ్ల నుంచి ఆ పదవులకు ప్రజాధనాన్ని జీత భత్యాలుగా తీసుకుంటున్న నాయకులు ఎందరో ! ఇదంతా ప్రభుత్వానికి తగని భారంగా మారుతున్నది.

విశ్రాంత​ అధికారులకు విలువైన పోస్టులు

విశ్రాంత ఉన్నతాధికారులకు నజరానాల కింద పదవులు మాత్రం దక్కినాయి. ధరణి వ్యవస్థను పేదల జీవితాలపై గుదిబండగా మార్చిన వ్యక్తులకు పొర్లుదండాలు పెట్టిన అధికారులకు పెద్ద పీటలు వేసి,  వారిని చట్టసభల్లో, సలహా మండలిలో, పోలీసు, ఇరిగేషన్, రోడ్లు రవాణా, ఇతర సంస్థల్లో నియమించిన ఉదంతాలు  అనేకం. 70 నుంచి 80 ఏండ్లు  నిండిన తమ సామాజికవర్గ విశ్రాంత అధికారులు, వయోవృద్ధులను కూడా బోలెడంత జీతాలు ఇచ్చి ప్రభుత్వ వ్యవస్థల్లో అధికార పీఠాలపై కూర్చుండ బెట్టినారు. కుంభకోణాల చరిత్ర ఉన్న వ్యక్తులు, యూజీసీ నిబంధనల ప్రకారం అర్హత లేని వ్యక్తులను, అవినీతి చరిత్ర మరకలు కనిపిస్తున్నవారిని ఉపకులపతులుగా నియమించడం జరిగిందని అనేక కథనాలు వినిపించాయి.

నజరానాలు  

నైజాంలో నవాబులు.. వందిమాగాదులకు, అంత:పురంలో పరిచర్యలు, దాసోహం చేసినవారికి ఆ రోజుల్లో ఇష్టారాజ్యంగా నజరానాలు పంచి పెట్టేవారు. చంద్రశేఖర రావు నియమించిన వారిలో ఈ కోవకు చెందినవారు గణనీయంగానే ఉంటారని అనేక ఉదంతాలు బయల్పడుతూనే ఉన్నాయి.    ప్రభువులకు, పార్టీకి, కుటుంబానికి విధేయులుగా ఉంటారో  లేదో అనిముఖ్యమంత్రికి అనుమానం ఉండవచ్చు.  పూర్వం తెలంగాణలో ఉన్న సామెతలాగా దొంగలకు సద్ది కడుతున్నారు అనే నానుడిని తెలంగాణ రాష్ట్ర పాలనా నియామకాల్లో అమలు చేస్తున్నట్లుగా భావించాల్సి వస్తున్నది.

పాదాభివందనాలు, పాలాభిషేకాలు  !

కుటుంబ వంశపారంపర్య వ్యవస్థగా ఎదగడం అవసరమని భావించిన  ముఖ్యమంత్రికి సమర్థులైన వ్యక్తులను నియమించుకోవడం రుచించలేదు. సమర్థులైన వారు కుటుంబ సేవ, పార్టీ సేవ, ముఖ్యంగా ఆర్థిక దోపిడీ చేసే వ్యక్తులకు, కుటుంబాలకు, సంస్థలకు ఉపయోగ పడకపోవచ్చు. నిరంకుశ పాలన స్థిరీకరణ చేసుకోవడానికి పాలాభిషేకాల ఉత్సవాలు కొనసాగించడానికి సమర్థులు అక్కరకు రారు. ఒక జిల్లా కలెక్టర్.. ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో పాదాభివందనం చేయడం దేశ చరిత్రలోనే మునుపెన్నడూ జరగలేదు. నైజాం కాలంలో నీరాజనాలు, పాదాభివందనాలు, పొర్లు దండాలు పెట్టడం, అయ్య బాంచన్ కాల్మొక్త అనే వారికి మాత్రమే నజరానాలు లభించేవి. బంగారు తెలంగాణలో ఈ సంస్కృతికి అంకురార్పణ జరగడమే కాక పటిష్టంగా విస్తరిస్తున్నది.

ఆరోపణలున్న ఉపకులపతులు

ప్రభుత్వం నియమించిన తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి అవినీతి భాగోతం బయటపడింది. మరో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయ ఉపకులపతి అవినీతి ఆరోపణల దర్యాప్తు చిట్టా ప్రభుత్వానికి తెలియనిది కాదు. కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతికి యూజీసీ నిబంధనల ప్రకారం అర్హత లేదని కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది. 2014 నుంచి రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు రెండు సార్లు ఉప కులపాతులను నియమించారు. మొదటిసారి కూడా నియామకాలు న్యాయస్థానాల్లో వివాదాస్పదమైనాయి. అయినా రెండవ సారి కూడా దాదాపు వివాదాస్పదులనే ఎంపిక చేసుకున్నారని వేరే చెప్పవలసిన అక్కరలేదు.  మారుతున్న జాతీయ, అంతర్జాతీయ ఉపాధి, ఉద్యోగ మార్కెట్లకు అనుకూలంగా సమర్థులైన వారిని ఉన్నత విద్యా మండలిలో నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రస్తుతం విశ్వవిద్యాలయాలను గమనిస్తే తెలుస్తుంది. ఎలాంటి సృజనాత్మక సంస్కరణలు కూడా చేపట్టకుండా పది సంవత్సరాల నుంచి ఈ సంస్థ విశ్వవిద్యాలయాల విధ్వంసానికి సహకరించిందని విద్యావేత్తలు, విద్యార్థులు తీవ్ర ఆందోళనలో పడ్డారు.

- కూరపాటి
వెంకట్ నారాయణ,
రిటైర్డ్ ​ప్రొఫెసర్​