మాటిచ్చి నాలుగేండ్లయితున్నా పత్తాలేని బీసీ పాలసీ

మాటిచ్చి నాలుగేండ్లయితున్నా పత్తాలేని బీసీ పాలసీ
  • 2017లో బీసీ ప్రజాప్రతినిధులతో కేసీఆర్‌ అధ్యక్షతన స్పెషల్ భేటీలు
  • మూడు రోజులపాటు చర్చించి 210 తీర్మానాలకు ఆమోదాలు
  • తీర్మానాలన్నీ అమలు చేస్తామని అప్పట్లో సీఎం హామీ
  • ఆ తర్వాత బీసీ సంఘాలతో చర్చించి రిపోర్టు రెడీ చేసిన మంత్రులు
  • రిపోర్టును సీఎంకు అందజేసినా ఇప్పటికీ అతీగతీ లేదు

బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పిన బీసీ పాలసీ పత్తాలేకుండా పోయింది. సీఎం అధ్యక్షతన అసెంబ్లీలో బీసీ ప్రజాప్రతినిధులతో మూడు రోజులపాటు ఆడంబరంగా నిర్వహించిన సమావేశాలు ఉత్త ముచ్చటయ్యాయి. ఏకగ్రీవంగా ఆమోదించిన 210 తీర్మానాలు అటకెక్కాయి. మాట ఇచ్చి నాలుగేండ్లయితున్నా అతీగతీ లేకుండా పోయింది. పాలసీ వస్తే అన్ని రంగాల్లో ముందుకు వెళ్లవచ్చని భావించిన బీసీలకు నిరాశే ఎదురైంది. ఏదో చేయబోతున్నట్లు అప్పట్లో హైప్​ క్రియేట్​ చేసి తర్వాత మూలకుపడేసిందని సర్కారుపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.

హైదరాబాద్​, వెలుగు: బీసీలను రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక పాలసీని తెస్తామని చెప్పి పక్కనపడేసింది. బీసీ పాలసీ కోసం  2017 డిసెంబర్​లో  బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో భేటీ అయ్యారు. మూడు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో.. బీసీల సమస్యల పరిష్కారానికి సలహాలు, సూచనలు తీసుకున్నారు.  210 తీర్మానాలు చేసి ఆమోదించారు. ఎడ్యుకేషన్, హెల్త్, రిజర్వేషన్లు, ఉపాధి తదితర రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తీర్మానాలన్నీ అమలు చేస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. ఇదే అంశంపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. కౌన్సిల్​లో తీర్మానం కూడా చేశారు. 

సీఎం వద్ద ఫైల్‌ పెండింగ్‌

అసెంబ్లీలో మూడురోజులపాటు నిర్వహించిన బీసీ ప్రజాప్రతినిధుల సమావేశాల తర్వాత అన్ని బీసీ కుల సంఘాలతో మంత్రులు సమావేశమయ్యారు. ఆయా కులాలతో విడి విడిగా భేటీలు జరిపి.. కులాల్లో ఉన్న సమస్యలు, ఇబ్బందులు ఏమిటి..? వాటికి పరిష్కారం ఏమిటి..? ఎంత బడ్జెట్ అవుతుంది..? తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మీటింగులు నాన్​స్టాప్​గా తొమ్మిది రోజులపాటు  జరిగాయి. అనంతరం వివిధ అంశాలను పరిశీలించి,  స్టడీ చేశాక అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీసీ పాలసీపై సమగ్రంగా రిపోర్ట్ తయారు చేశారు. దీన్ని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్​కు అందజేశారు.

రిపోర్ట్‌‌‌‌ ఇచ్చి నాలుగేండ్లయితున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికీ ఫైల్​ సీఎం దగ్గర్నే పెండింగ్‌‌‌‌లో ఉంది. బీసీ పాలసీ తీసుకువస్తే.. ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో తమకు మంచి అవకాశాలు దక్కుతాయని బీసీలు భావించారు. కానీ తీర్మానాలను, రిపోర్టును సర్కారు పక్కనడేసింది. ఆడంబరంగా సమావేశాలు పెట్టి, 210 తీర్మానాలు ఆమోదించి ఎందుకు పట్టించుకోవడం లేదని బీసీ సంఘాలు నిలదీస్తున్నాయి. తీర్మానాలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. 

తీర్మానాలు అమలు చేయకుంటే ఉద్యమిస్తం

2017 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో సీఎం అధ్యక్షతన బీసీ ప్రజాప్రతినిధులు, సంఘాలతో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించారు. ఇందులో అందరు కలిసి 210 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అవన్నీ బుట్టదాఖలు చేశారు. బీసీలను బిచ్చగాళ్లను చేస్తున్నరు. ఆ తీర్మానాలను అమలు చేయాల్సిందే. లేకుంటే ఉద్యమిస్తం.

- ఆర్‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌

బీసీలపై సర్కారు చిత్తశుద్ధి ఇదేనా..?

రాష్ట్ర సర్కారుకు బీసీలపై ప్రేమలేదు. బీసీలకు ఏదో చేస్తున్నట్లు అప్పుడు హైప్‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసిన్రు. మూడు రోజులు అసెంబ్లీలో, తొమ్మిది రోజులు బయట విస్తృత సమావేశాలు నిర్వహించి గొప్పగా ప్రచారం చేసుకున్రు. కానీ వాటిలోని అంశాలను మాత్రం అమలు చేయడంలేదు. బీసీలపై సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? సీఎంకు నాటి మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఇచ్చిన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ బయటకు రాకుండా చేసిన్రు. దాన్ని బయట పెట్టాలి. 

- జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌