విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా.పక్కా యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌.రైతు వేదికల వద్దే విత్తనాలు,ఎరువుల పంపిణీ

విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా.పక్కా యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌.రైతు వేదికల వద్దే విత్తనాలు,ఎరువుల పంపిణీ
  • ఉన్నతాధికారులతో కమిటీ.. 
  • రైతు వేదికల వద్దే విత్తనాలు, ఎరువుల పంపిణీ: సీఎం రేవంత్‌‌‌‌
  • అన్ని రకాల ఫర్టిలైజర్స్‌‌‌‌కు యాప్‌‌‌‌ బుకింగ్​
  • అడిషనల్‌‌‌‌ కలెక్టర్లకు యూరియా పంపిణీ బాధ్యతలు  
  • ప్రతి వేదిక వద్ద అగ్రికల్చర్, రెవెన్యూ, పోలీస్ అధికారులు
  • ఎరువుల కోసం కేంద్రంపైన ఎప్పటికప్పుడు ఒత్తిడి
  • ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల టీం 
  • సన్నాలు పండించే రైతులకు బోనస్.. 
  • అందుబాటులో 7 రకాల విత్తనాలు 
  • వ్యవసాయ, సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ శాఖలు, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ వర్సిటీ సమన్వయంతో పనిచేయాలని సూచన 
  • వ్యవసాయ శాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్, వెలుగు:  రైతులకు విత్తనాల సరఫరా మొదలుకొని పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు  వ్యవసాయానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అదేశించారు. పంట వేసినప్పటినుంచే రైతులవారీగా పంట వివరాల నమోదు, దిగుబడి అంచనాలు, అందుకు తగ్గట్టుగా విత్తనాలు, ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశలో వ్యవసాయ శాఖ పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని ఎంసీహెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీ బోధి పెవిలియన్‌‌‌‌లో   వ్యవసాయ శాఖపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విత్తనాలు, ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటివరకు ఉన్న అనుభవాలు, రైతులు ఇబ్బంది పడకుండా చేపట్టాల్సిన చర్యలపై రైతు కమిషన్‌‌‌‌, అగ్రికల్చర్‌‌‌‌ యూనివర్సిటీ, వ్యవసాయ నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలపై సమావేశంలో చర్చించారు.  ఈ సీజన్‌‌‌‌ నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా ఇప్పుడే ఉన్నతాధికారుల  కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.  

ఏఐని వినియోగించుకోవాలి 

వ్యవసాయ శాఖలో టెక్నాలజీని, ముఖ్యంగా ఏఐ వినియోగాన్ని మరింత పెంచాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సూచించారు. అగ్రికల్చర్‌‌‌‌ వర్సిటీని నోడల్‌‌‌‌ ఏజెన్సీగా పెట్టుకొని 
విత్తనాల నుంచి కొనుగోళ్ల వరకు  సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలన్నారు. వ్యవసాయ శాఖ, సివిల్‌‌‌‌ సప్లయ్స్​, అగ్రికల్చర్‌‌‌‌ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేసి, రైతులకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ ఫలితాలు అధ్యయనం చేయాలని సూచించారు.


ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఫెర్టిలైజర్లను యాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా బుక్ చేసే విధానం తీసుకురావాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. యాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా రైతులు బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా పంపిణీ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలన్నారు.  ఖరీఫ్ సీజన్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుకు సీఎం సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి, వాస్తవ పరిస్థితిని వివరించాలన్నారు. అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని సూచించారు.

మక్క కొనుగోళ్లతో నష్టం తగ్గించగలిగాం

మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ నష్టాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. వ్యాపారులకు తలొగ్గకుండా ఈ సారి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిన కారణంగా మక్క కొనుగోళ్లతో వచ్చే నష్టం తగ్గించగలిగామని వివరించారు. గతంలో రూ. 13 వేలకు టన్ను అమ్మే పరిస్థితి ఉందని.. ఈసారి దాదాపు రూ. 21 వేలకు పైగా టెండర్ రేట్ వచ్చిందని చెప్పారు.  ఆయిల్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ను మరింత బలోపేతం చేసి లాభాలదిశగా నడిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ డెయిరీని మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. సకాలంలో పాల రైతులకు చెల్లింపులు జరపాలని సూచించారు. 

రైతులకు ఉపయోగపడే కేంద్రాలుగా 

ధాన్యం కొనుగోళ్ల సమయంలో అకాల వర్షాలు, తూకం, రవాణా, నిల్వ, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌లాంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. ఇక సన్న వడ్లు పండించే రైతులకు బోనస్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్న నేపథ్యంలో మార్కెట్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్​ ఉన్న ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించాలన్నారు. సన్న వడ్లు పండించే రైతుల పూర్తి డేటా సేకరించాలని ఆదేశించారు.  రైతు వేదికలను ఇకపై రైతులకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, రైతులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతోపాటు రెవెన్యూ, పోలీస్‌‌‌‌‌‌‌‌ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాల్లో రైతుకేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి , వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉన్నతాధికారుల కమిటీ విధులివే

వ్యవసాయ శాఖ  కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఉన్నతాధికారుల కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లైస్‌‌‌‌‌‌‌‌ మేనేజింగ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌, ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ విభాగం కార్యదర్శి సభ్యులుగా ఉండనున్నారు. విత్తనాల పంపిణీ మొదలుకొని గ్రామాలవారీగా రైతులు, పంటల వివరాల నమోదును కమిటీ పరిశీలిస్తుంది.  ఆయా దశల్లో తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా ఎరువుల పంపిణీని పర్యవేక్షిస్తుంది. అలాగే పంట ఉత్పత్తుల అంచనాలు రూపొందించి ధాన్యం కొనుగోళ్లు సాఫీగా పూర్తయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోపాటు ఈ ప్రక్రియకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటుంది. ఏ రైతు ఏ పంట వేశాడు? ఏ గ్రామంలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? అనే వివరాలు కచ్చితంగా నమోదయ్యేలా చూడడం కూడా వీరి బాధ్యతే.  కేంద్రం నిర్దేశించిన కోటాలను అనుసరించి రాష్ట్రంలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సాఫీగా జరిగేలా, మద్దతు ధర దక్కేలా అన్ని చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ సూచించారు.