
చేర్యాల, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చెట్కూరి కమలాకర్ యాదవ్ సొంత ఖర్చుతో మండలంలోని 11 పాఠశాలలకు, 900 మంది విద్యార్థులకు షూ, టై, బెల్టులు, ఐడెంటిటీ కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల సమస్యలు, స్కూల్ లో ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. మూతపడిన పాఠశాలలను తెరిచి పేద విద్యార్థులకు చదువు అందిస్తున్నామన్నారు.
క్రీడలకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. వెనుకబడిన దూల్మిట్ట, మద్దూరు ప్రాంతాల్లో రైతుల సమస్యలు, చెక్ డ్యాం సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తపాస్‌పల్లి డ్యామ్ నుంచి నీటిని మళ్లీ సంబంధిత ప్రాంతానికి తరలించడానికి సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించినట్లు తెలిపారు. యూత్ కాంగ్రెస్ జనగామ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చెట్కూరి కమలాకర్ యాదవ్, మాజీ జడ్పీటీసీ, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరి కొండల్ రెడ్డి పాల్గొన్నారు.