
- సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో టీజీసీహెచ్ఈ చర్యలు
- ఏఐతోపాటు రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టులు
- ఇంగ్లిష్‌పై పట్టు కోసం సిలబస్ ప్రక్షాళన.. కమ్యూనికేషన్ స్కిల్స్‌పైనా ఫోకస్
- డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు
హైదరాబాద్, వెలుగు: కాలం చెల్లిన సబ్జెక్టులతో దండుగలా మారిన పలు ‘డిగ్రీ’ కోర్సులకు రాష్ట్ర సర్కారు కొత్త రూపు ఇస్తున్నది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా డిగ్రీ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సిలబస్‌లో భారీగా మార్పులు, చేర్పులు చేపట్టింది. ఇంజినీరింగ్‌కు దీటుగా ఏఐ, రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టులను ప్రవేశపెడ్తూనే - ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ సహా ఆల్రౌండ్డెవలప్మెంట్కు పెద్దపీట వేస్తున్నది. మూడేండ్ల డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటుండడంపై విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో కమిటీ
రాష్ట్రంలో సర్కారు, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ల పరిధిలో 957 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో ప్రతి ఏడాది 2 లక్షలకుపైగా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కాలానికి తగ్గట్టుగా ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ తదితర కోర్సుల సిలబస్ మారుతూ వస్తున్నా.. సంప్రదాయ డిగ్రీ సిలబస్‌లో మాత్రం గత ప్రభుత్వాలు ఎలాంటి మార్పులు, చేర్పులు చేపట్టలేదు. కేవలం కొన్ని కొత్త కోర్సులు తెచ్చి మమ అనిపించారు. దీంతో డిగ్రీలు, పీజీలు చేసిన లక్షలాది మంది యువత ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా ఖాళీగా ఉంటున్నారు.
ఈ పరిస్థితిని మార్చాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు తగ్గట్టుగా 2025–26 విద్యాసంవత్సరం నుంచి ప్రస్తుతమున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) నిర్ణయించింది. అటు యూజీసీ సైతం ప్రతి సబ్జెక్టులో కనీసం 20% స్కిల్ ఓరియంటెడ్ సిలబస్‌గా మార్పుచేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో కొత్త సిలబస్ తయారీకి బీకామ్, లా, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో సిలబస్ మార్పుల కోసం టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌తో కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో మార్పులకు వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, బీఎస్సీ గ్రూపుల్లోని సబ్జెక్టులకు కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎస్‌కే మహమూద్‌తోపాటు ఇంజినీరింగ్ కోర్సులకు సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ నేతృత్వంలో సిలబస్ మార్పుల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఆయా సబ్జెక్టుల ఎక్స్‌పర్ట్స్‌తో సమావేశమై, ఉపాధికి ఊతమిచ్చేలా మూడేండ్ల కోసం కొత్త సిలబస్‌ను రెడీ చేశాయి. దీనిపై వీసీలతో సమావేశంలోనూ చర్చించి, చివరికి వర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్)లకు పంపించారు. ఆయా వర్సిటీలు చర్చించి, కొత్త సిలబస్‌ను ఈ ఏడాది ఫస్టియర్ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చాయి. తర్వాతి రెండేండ్లు కూడా సెకండియర్, థర్డ్ ఇయర్‌లో సిలబస్ మారనున్నది. మూడేండ్లు, నాలుగేండ్ల డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఏదో ఒక ఉద్యోగం పొందేలా లేదంటే.. తనంత తానే ఉపాధి అవకాశం కల్పించుకునేలా స్కిల్స్ నేర్పించనున్నారు.
ఏఐ, రోబోటిక్స్‌కు ప్రత్యేకంగా పేపర్లు..
రాష్ట్రంలో స్కూల్ లెవెల్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, తదితర సబ్జెక్టుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీలోనూ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులనూ సబ్జెక్టుల్లో చేర్చారు. యూజీసీ ఆదేశాల మేరకు విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేలా.. వాటిలోనూ కొత్త అంశాలనూ చేర్చారు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌తో డిగ్రీ కోర్సులు చదివిన వారికీ ఉద్యోగాలు వస్తున్నట్టు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నిరుడు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి 22శాతం ఉద్యోగాలు వస్తే, బీకామ్ డిగ్రీ పూర్తి చేసిన 35 నుంచి 40 శాతం మంది స్టూడెంట్స్ కొలువులు సాధిస్తున్నట్టు తేలింది. ఈ విషయాన్ని అర్థం చేయించేందుకు 40వేల మంది విద్యార్థులకు ఓరియంటేషన్ క్లాసులనూ అధికారులు నిర్వహించారు. ప్రస్తుతం మారుతున్న సిలబస్‌తో భవిష్యత్తులో డిగ్రీ విద్యార్థులు మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునే చాన్స్ ఉందని విద్యావేత్తలు చెప్తున్నారు.
ఇంగ్లిష్‌పై పట్టు కోసం..
ఇంగ్లిష్‌లో విద్యార్థులు నైపుణ్యం సాధించేలా సిలబస్‌లో టీజీసీహెచ్‌ఈ భారీగా మార్పులు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, కొత్తగా సిలబస్ రెడీ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్లతో కౌన్సిల్ అధికారులు పలుమార్లు సమావేశమయ్యారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు ఈజీ టూ లర్న్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ఇటీవలే 4 సెమిస్టర్లకు సంబంధించిన సిలబస్‌ను రూపొందించి, వర్సిటీలకు పంపించారు. ఫస్ట్ సెమిస్టర్‌లో బేసిక్ ఫౌండేషన్ స్కిల్స్‌తో క్లాసులు మొదలుపెట్టి, ప్రొఫెషనల్ ఆర్టికల్స్ రాసేలా స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. నిజజీవితంలో ఉపయోగించే ఇంగ్లిష్‌పై ఎక్కువ ఫోకస్‌పెట్టారు. మాట్లాడటం, రాయడం, చదవడంపైనా దృష్టి సారించారు. ఈ క్రమంలో విద్యార్థులకు 250 పేజీల రీడింగ్ మెటీరియల్, ఒక్కో యూనిట్‌పై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఆడియోనూ అందించబోతున్నారు. టీ సాట్ ద్వారా ఓరియంటేషన్ క్లాసులనూ ఇప్పించేలా ప్లాన్ చేశారు. దీనికితోడు స్టూడెంట్లకు వర్క్‌బుక్ కూడా అందించనున్నారు. మరోపక్క టీచర్లకూ ఉపయోగపడేలా స్పెషల్ హ్యాండ్‌బుక్ ఇవ్వనున్నారు.
సీఎం ఆదేశాలతో మార్పులు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిగ్రీలో ఉపాధికి ఊతమిచ్చేలా సిలబస్‌లో మార్పులు తీసుకొచ్చాం. మారుతున్న మార్కెట్ అవసరాలకు తగ్గట్టు డిగ్రీలో కోర్సులు, సిలబస్ తీర్చిదిద్దినం. దాదాపు 6 నెలల పాటు వర్సిటీలు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ల సహకారంతో కొత్త సిలబస్ రెడీ చేశాం. దీని తయారీలో యూజీసీ, రెగ్యులేటరీ బాడీల సూచనలనూ పరిగణనలోకి తీసుకున్నాం. డిగ్రీలో క్రెడిట్స్‌నూ 140కి తగ్గించినం. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌పై పట్టు కోసం ప్రత్యేకంగా సిలబస్ తయారు చేశాం. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు చర్యలు తీసుకున్నాం. బాలకిష్టారెడ్డి, టీజీసీహెచ్‌ఈ చైర్మన్