
- ప్రభుత్వ విద్యాసంస్థల్లోచదివే వారికి ఫ్రీగాహిస్టారికల్ టూర్
- సెకండ్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు నాలుగు కేటగిరీలుగా విభజన
- ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలో పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తీసుకొస్తూ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు స్టూడెంట్లను నాలుగు కేటగిరీలుగా విభజించి లక్ష మంది విద్యార్థులకు ట్రిప్‌లను ప్లాన్ చేశారు. ఎకో టూరిజంతో పాటు ఆర్ట్ అండ్ క్రాప్ట్స్ హెరిటేజ్ నిర్మాణాలు, చారిత్రాక, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ప్రాంతాలకు వారిని ఉచితంగా తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం రూ12.10 కోట్లు కేటాయించింది.
మొదటి కేటగిరీలో రెండో తరగతి నుంచి నాలుగో తరగతి విద్యార్థులు ఉంటారు. వీరికి అదే గ్రామంలో లేదా మండల పరిధిలో ఉన్న హెరిటేజ్ సైట్స్, పార్క్‌లకు తీసుకెళ్తారు. ఇందులో ఒక్కో విద్యార్థికి రూ.300 చొప్పున 30 వేల మంది విద్యార్థులకు ఖర్చు చేస్తారు. రెండో కేటగిరీలో ఐదో తరగతి నుంచి 8వ తరగతి వరకు 20 కిలో మీటర్ల నుంచి 30 కిలో మీటర్ల వరకు ఉన్న టూరిజం ప్రాంతాలను చూసేలా డే ట్రిప్ ఇచ్చారు. ఇందులో స్టూడెంట్‌కు రూ.800 చొప్పున 40 వేల మంది విద్యార్థులకు ఖర్చు చేస్తారు. మూడో కేటగిరీలో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న విద్యార్థులను 50 కిలోమీటర్ల నుంచి 70 కిలో మీటర్ల పరిధిలో పర్యాటక ప్రాంతాలకు రెండ్రోజులు ట్రిప్‌కు తీసుకెళ్తారు. ఇందులో 20 వేల మందికి రూ.2 వేల చొప్పున ఖర్చు చేస్తారు. నాలుగో కేటగిరీలో 10 వేల మంది గ్రాడ్యుయేషన్ విద్యార్థులను రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఉన్న టూరిజం ప్రాంతాలకు ట్రిప్‌గా తీసుకెళ్తారు. నాలుగు రోజుల పాటు ఉండే ఈ ట్రిప్‌లో ఒక్కో విద్యార్థిపైన రూ.4 వేల చొప్పున ఖర్చు చేస్తారు. చారిత్రక, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని తీసుకువచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.