
- కిన్నెరసాని ముంపు ప్రాంతాలు గుర్తించాలె
- పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లేఖ
హైదరాబాద్, వెలుగు : పోలవరం ప్రాజెక్టు కారణంగా కిన్నెరసాని, ముర్రేడువాగు పరిసర ప్రాంతాలు ముంపునకు గురికాకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఇరిగేషన్ ఈఎన్సీ (జనరల్) మురళీధర్ ఇటీవల పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చైర్మన్‌కు లేఖ రాశారు. పోలవరం ముంపు ప్రాంతాలపై ఎన్‌జీటీ ఆదేశాలతో నిరుడు అక్టోబర్ 14న కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారని తెలిపారు. కిన్నెరసాని, ముర్రేడువాగు సమీప ప్రాంతాల్లో ముంపు, నదుల్లో నీరు ఎంతమేరకు నిలిచి ఉంటుందనే సీడబ్ల్యూసీ స్టడీని పీపీఏ మెంబర్ సెక్రటరీ ఆ సమావేశంలో వివరించారని తెలిపారు. ఈ స్టడీ ప్రకారం.. పోలవరం డ్యాం నుంచి 36 లక్షల క్యూసెక్కుల వరద వదిలేసే పరిస్థితుల్లో కిన్నెరసారి నదిలో నీటి ప్రవాహ సామర్థ్యం 46 క్యూమెక్కుల నుంచి 12 క్యూమెక్కులకు పడిపోతుందని వివరించారు. గోదావరి–కిన్నెరసాని సంగమానికి 13.75 కి.మీ.ల ఎగువ వరకు వరద నీరు నిలిచి ఉంటుందని తెలిపారు. ముర్రేడువాగు ప్రవాహ సామర్థ్యం 38 క్యూమెక్కుల నుంచి ఒక క్యూమెక్‌కు పడిపోతుందని, ముర్రేడువాగు–కిన్నెరసాని సంగమానికి ఎగువన ముర్రేడువాగులో 5.25 కి.మీ.ల వరకు వరద నిలిచిపోతుందని వివరించారు. పోలవరం డ్యాం సైట్ వద్ద 50 ఏళ్ల గరిష్ట వరద (25.53 లక్షల క్యూసెక్కులు)ను పరిగణలోకి తీసుకుంటే కిన్నెరసాని ప్రవాహ సామర్థ్యం 28 క్యూమెక్కుల నుంచి ఒక క్యూమెక్‌కు పడిపోయిందని, కిన్నెరసానిలో గోదావరి–కిన్నెరసాని సంగమానికి13 కి.మీ. ఎగువ వరకు వరద నిలిచిపోయిందని గుర్తు చేశారు. ముర్రేడువాగు ప్రవాహ సామర్థ్యం 8 క్యూమెక్కుల నుంచి ఒక క్యూమెక్‌కు పడిపోయిందని, ముర్రేడువాగులో కిన్నెరసాని–మున్నేరువాగు సంగమానికి 3.5 కి.మీ.ల వరకు నీరు నిలిచిపోయిందని తెలిపారు.
పీపీఏ చర్యలు తీసుకోవాలె
పోలవరం ప్రాజెక్టు డిశ్చార్జి కెపాసిటీ పెంచినందున కిన్నెరసాని, ముర్రేడువాగు సమీప ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ప్రాజెక్టు అథారిటీ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురయ్యే తెలంగాణ భూభాగాన్ని గుర్తించాలని, పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఆయా భూములకు పరిహారం, నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. బ్యాక్ వాటర్ ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించాలంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తాము ఇంప్లీడ్ అయ్యామని పేర్కొన్నారు. ఒడిశా, చత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో ముంపు ప్రభావ ప్రాంతాలను గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణాను ఈ జాబితాలో చేర్చి ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలని కోరారు.