హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలనను వేగవంతం చేయడంతోపాటు పారదర్శకత పెంచేందుకు పరిపాలనా వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖల డిజిటలైజేషన్, ఉద్యోగుల ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈహెచ్‌ఆర్‌ఎంఎస్) అమలుపై సీఎస్ సంజయ్ జాజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరి సర్వీస్ రికార్డులు, సేవా వివరాలను ఈ నెల 15లోగా ఈహెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రభుత్వ అనుమతులు, అధికారిక ఉత్తర్వులు (జీవోలు), అభివృద్ధి పనుల సాంకేతిక అనుమతులు (టీఎస్) డిజిటల్ రూపంలోనే జారీ చేయాలని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖకు సంబంధించిన నిధుల మంజూరు, చెల్లింపులను ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని సూచించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు డీబీటీ నిధులను ఆధార్ ఆధారిత ధ్రువీకరణతో చెల్లించాలని ఆదేశించారు.
