మూడేండ్ల నుంచి లైబ్రరీ గ్రాంట్స్ ఇస్తలేరు

మూడేండ్ల నుంచి లైబ్రరీ గ్రాంట్స్ ఇస్తలేరు
  • కొత్త పుస్తకాలు లేకుండానే రీడ్ ప్రోగ్రామ్ నిర్వహణ

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని స్కూల్ లైబ్రరీలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మూడేండ్ల నుంచి లైబ్రరీ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో కొత్త పుస్తకాలు రావట్లేదు. దీంతో స్టూడెంట్స్​లో పఠనాసక్తి పెంచేందుకు నిర్వహిస్తున్న ‘రీడ్’ ప్రోగ్రామ్ లక్ష్యం నెరవేరడం లేదు. ఏటా కేంద్రం లైబ్రరీలకు నిధులిస్తున్నా.. దానికి మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్​ వెనుకాడుతోంది. ఈ ఏడాది కూడా లైబ్రరీ నిధులు విడుదల చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

60 శాతం నిధులు కేంద్రానివే..

రాష్ట్రంలో ఉన్న 30,154 సర్కారీ బడుల్లో 30 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరిలో చదివే ఆసక్తి పెంచడానికి లైబ్రరీలను ఏర్పాటు చేశారు. గతంలో నేరుగా స్కూళ్లకే నిధులు ఇచ్చేవారు. కానీ మూడేండ్ల నుంచి ఈ విధానాన్ని మార్చారు. కొత్త సిస్టమ్ ప్రకారం స్టేట్ లెవెల్​లో ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏయే పుస్తకాలు కొనాలో నిర్ణయించాలి. తర్వాత వాటిని గవర్నమెంట్ పబ్లిషర్స్ వద్ద కొని బడులకు పంపాలి. ఏటా ప్రైమరీ స్కూల్స్​కు రూ.5 వేలు, యూపీఎస్​లకు రూ.13 వేలు, హైస్కూళ్లకు రూ.15 వేలు, హైస్కూల్, కాలేజీలు కలిసి ఉన్న కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు రూ. 20 వేలు కేటాయించాల్సి ఉంది. ఇందుకు ఏడాదికి రూ.23 కోట్ల గ్రాంట్స్ అవసరం. ఇందులో 60% కేంద్రం ఇస్తుండగా.. 40% రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కలపాలి. కానీ గత మూడేండ్లుగా ఈ నిధుల విషయంలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాగా, కొత్త పుస్తకాలు లేకుండానే 'రీడ్' ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్​ అన్నారు. లైబ్రరీ గ్రాంట్స్ విడుదల చేస్తే మరిన్ని పుస్తకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నిధుల విషయం మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లినా ఇంకా రిలీజ్ కాలేదని తెలిపారు. 

మూడేండ్ల నుంచి ఒక్క పుస్తకమూ ఇయ్యలే.. 

2019–20 అకడమిక్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఏ స్కూల్​కూ ఒక్క పుస్తకం కూడా అందలేదు. కేంద్ర ఆదేశాల మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి రీడ్ ఎంజాయ్ అండ్ డెవలప్ (రీడ్) ప్రోగ్రాంను స్కూల్స్​లో నిర్వహిస్తున్నారు. అయితే పెద్దగా పుస్తకాలు లేకపోవడంతో లైబ్రరీకి క్లాస్ కేటాయించడం లేదని, అందుకే ప్రోగ్రామ్ సక్సెస్ కావడం లేదని టీచర్లు అంటున్నారు. కొత్త పుస్తకాలు లేకపోవడంతో స్టూడెంట్లు చదవడానికి ఆసక్తి చూపడం లేదని చెప్తున్నారు.