హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ జూనియర్ కాలేజీల ఏర్పాటుపై ప్రభుత్వం పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత స్టేట్‌లో కేవలం రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రమే కొత్తగా ఏర్పాటు చేసింది. ఇంటర్మీడియెట్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నా, సర్కారు వాటిని చెత్తబుట్టలో పడేస్తోంది. దీంతో స్టూడెంట్స్ దూరప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తుండగా, కొందరు ప్రైవేట్ కాలేజీలకు వెళ్లే స్థోమత లేక చదువులు మానేయాల్సిన దుస్థితి నెలకొన్నది.
తెలంగాణ వచ్చాక రెండే కాలేజీలు..
రాష్ట్రంలో 2,558 జూనియర్ కాలేజీలుంటే, వాటిలో 404 సర్కారు కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో సుమారు 1.76 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. కొన్ని జిల్లాల్లో సర్కారు జూనియర్ కాలేజీల ఏర్పాటుకు విద్యార్థి సంఘాలు, స్టూడెంట్లు, పేరెంట్స్ ఏండ్ల తరబడి ఆందోళనలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమూ అదే ధోరణిలో వ్యవహరిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 2016లో బోరబండ, సీతాఫల్‌మండిలో రెండు జూనియర్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఇలా ఎవ్వరి నుంచి ప్రతిపాదనలు వచ్చినా సర్కారు పట్టించుకోవడం లేదు. ఒకరి ప్రపోజల్‌ను ఒప్పుకొంటే.. అందరివీ తీసుకోవాల్సి వస్తుందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన 2 కాలేజీలు కూడా ఇప్పటికీ హైస్కూల్ భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
20 నియోజకవర్గాల్లో కాలేజీల్లేవ్..
రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే, 20 సెగ్మెంట్లలో సర్కారు జూనియర్ కాలేజీలు లేవని అధికారులు చెప్తున్నారు. సిటీలోని ముషీరాబాద్, కార్వాన్, ఉప్పల్ తదితర సెగ్మెంట్లలో గవర్నమెంట్ కాలేజీలు లేవు. స్టేట్‌లో పాత, కొత్త మండలాలు 590కి పైగా ఉన్నాయి. వీటిలో సుమారు 100 మండలాల్లో సర్కారు కాలేజీలే కాదు.. ప్రైవేటు కాలేజీలూ లేవు. ఏటా ఎమ్మెల్యేలు తమ సెగ్మెంట్లలో కాలేజీలకు ఇంటర్ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపడం, వాటిని అధికారులు ప్రభుత్వానికి పంపించడం పరిపాటిగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి కొత్త కాలేజీ ల కోసం ఎక్కువగా ప్రపోజల్స్ వస్తున్నాయి. కొత్త కాలేజీ బిల్డింగ్‌కు రూ.5 కోట్లు, స్టాఫ్ కు ఏటా రూ.10 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు ఉన్నాయి. ఆ మేరకు ఖర్చు చేసేందుకు సర్కారు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.
మండలానికో కాలేజీ పెట్టాలె..
రాష్ట్రంలో ప్రతి ఏటా ఐదున్నర లక్షల మంది టెన్త్ పరీక్షలు రాస్తుండగా, ఐదు లక్షలకుపైగా స్టూడెంట్లు పాస్ అవుతున్నారు. అయితే ఇంటర్‌లో చేరేందుకు వారికి సర్కారు కాలేజీలు మాత్రం అందుబాటులో లేవు. కొన్ని మండలాల్లో 10 వరకు హైస్కూల్స్ ఉన్నా, కాలేజీలు లేకపోవడంతో వారంతా చదువుకునేందుకు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అమ్మాయిలను దూరంగా ఉన్న టౌన్లకు పంపేందుకు కొందరు పేరెంట్స్ ఇష్టపడటం లేదు. దీంతో వారి చదువు మధ్యలోనే ఆగిపోతోంది. ఈ ఏడాది నుంచి సర్కారు కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కూడా పెడతామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో, ఆ కాలేజీలకు ఫుల్ డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా మండలానికొక జూనియర్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పేరెంట్స్, స్టూడెంట్స్, యూనియన్ల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
