నూనె గింజల సాగుకు సర్కారు సాయమేది?

నూనె గింజల సాగుకు సర్కారు సాయమేది?
  • అప్పుడు విత్తనాలు లేవు.. ఇప్పుడు మద్దతు లేదు.. 
  • రైతులకు అందని పామాయిల్ మొక్కలు
  • నకిలీ సీడ్స్​తో ఎదగని సన్​ఫ్లవర్
  • మద్దతు లేక నష్టపోతున్న పల్లి, పొద్దుతిరుగుడు రైతులు

ఖమ్మం, వెలుగు:  ఎక్కడో ఉక్రెయిన్​లో యుద్ధం జరిగితే మన వంటింట్లో మంట రగులుతోంది. యుద్ధానికి ముందు లీటర్​ పొద్దుతిరుగుడు, పల్లి ప్యాకెట్​ రేటు రూ.145 ఉంటే ఇప్పుడు రూ.200 దాటింది. తెలంగాణలో కోటి ఎకరాల్లో పంటలు పండుతున్నా  విదేశాల నుంచి సన్​ఫ్లవర్, పామాయిల్​దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితే ఇందుకు కారణం. ఈ క్రమంలో నూనెగింజల సాగును ప్రోత్సహిస్తున్నామని రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా మాటలకే పరిమితం అవుతోంది. 
ఈ యాసంగి ప్రారంభంలో సర్కారు వరి వద్దనడంతో చాలామంది నూనె గింజల సాగుకు మొగ్గుచూపినా సన్​ఫ్లవర్​ సీడ్స్, పామాయిల్​ మొక్కలు​ అందించడంలో సర్కారు ఫెయిలైంది. తీరా పల్లి లాంటి పంటలు చేతికి వచ్చాక కనీస మద్దతు ధర ఇప్పించలేక చేతులెత్తేసింది.

8 శాతానికే పరిమితమైన నూనెగింజల సాగు.. 

యాసంగిలో ఎక్కువ సంఖ్యలో రైతులు నూనె గింజల సాగుపై దృష్టిపెట్టారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పామాయిల్ వంటి పంటలు సాగు చేసేందుకు ముందుకువచ్చారు. కానీ రైతుల ఆలోచనలకు అనుగుణంగా ఆయా పంటలకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం అందించలేకపోయింది. జిల్లాల్లో పంట మార్పిడి చేయాలని చెప్పిన వ్యవసాయ శాఖ అధికారులే సీడ్స్​అడిగితే మాత్రం చేతులెత్తేశారు. ఎవరికి వారు సొంతంగా సీడ్స్ సమకూర్చుకోవాలని చెప్పడంతో కొందరు రైతులు ప్రైవేట్​వ్యాపారుల వద్ద అష్టకష్టాలు పడి తెచ్చుకోగా, మిగిలినవాళ్లు నూనెగింజల సాగు మానుకున్నారు. దీంతో యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 54,41,985 ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా, నూనెగింజల విస్తీర్ణం 8 శాతానికే పరిమితమైంది. ఇందులోనూ 3,57,211 ఎకరాల్లో పల్లి, 77,869 ఎకరాల్లో నువ్వులు, 43,258 ఎకరాల్లో పొద్దుతిరుగుడు..ఇలా 4.78 లక్షల ఎకరాల్లో నూనెగింజలు సాగయ్యాయి. ఖమ్మం లాంటి జిల్లాల్లో పొద్దుతిరుగుడు  సాగుచేసిన రైతులు నకిలీ సీడ్స్​ వల్ల నష్టపోగా, పాలమూరు లాంటి జిల్లాల్లో వ్యాపారులు సిండికేట్ గా మారి పల్లి రైతులను దోచుకున్నారు.

నకిలీ సీడ్స్​తో మునిగిన సన్​ఫ్లవర్​ రైతులు.. 

రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 43,258 ఎకరాల్లో రైతులు  సన్​ఫ్లవర్​ సాగుచేయగా, చాలా చోట్ల నకిలీ సీడ్స్​ కారణంగా పంట ఎదగలేదు.  ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన రైతులు  సన్ ఫ్లవర్ సాగుచేయాలని భావించారు. విత్తనాల కోసం వ్యవసాయ శాఖాధికారులను అడిగినా స్పందించకపోవడంతో ఆన్ లైన్ లో ఓ కంపెనీ డీలర్​ను సంప్రదించారు. పుణేకి చెందిన మాన్ సూన్​ కంపెనీ నుంచి ఎఫ్ వన్ సన్ గోల్డ్ విత్తనాలను గజ్వేల్ కేంద్రంగా పనిచేస్తున్న డీలర్ ద్వారా కొన్నారు. అప్పట్లో డిమాండ్ ఉండడంతో రూ.900 ఎమ్మార్పీ ఉన్న ప్యాకెట్ ను రూ.2200 చొప్పున కొనుగోలు చేశారు. 90 మందికి పైగా రైతులు 150 ఎకరాల్లో పంట సాగు చేశారు.  నెలలు గడుస్తున్నా మొక్కల్లో ఎదుగుదల లేకపోవడం, సన్ ఫ్లవర్ పూల దిగుబడి రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నారు. మండల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయాల ముందు ఆందోళన చేయడంతో స్పందించిన ఆఫీసర్లు, సైంటిస్టులను రప్పించారు. ఫిబ్రవరి చివరి వారంలో సన్ ఫ్లవర్ పంటను పరిశీలించి, నమూనాలను సేకరించి ల్యాబ్ లో పరీక్షలు చేశారు. సన్ ఫ్లవర్ విత్తనాలు నకిలీవని తేల్చి నివేదిక ఇచ్చారు.  మోసం చేసిన కంపెనీ మీద, డీలర్ పైన పీడీ యాక్టు పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నా ఇప్పటివరకు చర్యలు లేవు. రైతులు మాత్రం విలువైన పంట కాలాన్ని, పైసలను నష్టపోయారు. ఇక అడపాదడపా వివిధ జిల్లాల్లో పండిన సన్​ఫ్లవర్​ను ప్రభుత్వపరంగా కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్​వ్యాపారులు అడ్డికి పావుశేరు అడుగుతున్నారు. పొద్దుతిరుగుడుకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.6,015 కాగా, సిద్దిపేట లాంటి మార్కెట్లలో వ్యాపారులు సిండికేట్​గా మారి రూ.5,000 నుంచి రూ.5,500 మాత్రమే చెల్లిస్తున్నారు.

 టార్గెట్​ రీచ్ ​ అయ్యేదెప్పుడు?

రాష్ట్రంలో మూడేళ్లలో పామాయిల్​ సాగును 20 లక్షల ఎకరాలకు  పెంచాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. లక్ష్యాన్ని పెద్దగా పెట్టుకున్న ఆయిల్​ఫెడ్​ ఆఫీసర్లు,  కొత్తగా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్న రైతులకు మాత్రం మొక్కలు సప్లై చేయడం లేదు. ఇప్పటికే సాగు చేస్తున్న రైతులకు మెరుగైన ధర ఇప్పించడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 50 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తుండగా, దాదాపు 39 వేల ఎకరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఒకటి, దమ్మపేట మండలం అప్పారావుపేటలో మరొకటి పామాయిల్ ఫ్యాక్టరీలుండడమే ఇందుకు కారణం. గతేడాది పెద్దపల్లి, సిద్దిపేట, నారాయణపేట, మహబూబాబాద్, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల నుంచి బస్సుల్లో వందల మంది రైతులను తీసుకువచ్చి పామాయిల్ సాగుపై అవగాహన కల్పించారు. అయితే పంట సాగుకు ముందుకు వచ్చిన రైతులకు ఆఫీసర్లు సహకరించడం లేదనే ఆరోపణలున్నాయి. మూడేళ్ల క్రితం మొక్కలు కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికీ ఇవ్వడం లేదు.  ప్రస్తుతం అశ్వరావుపేట మండలం నారంవారిగూడెంలో కొత్తగా మూడు నర్సరీ బ్లాక్ లను ఏర్పాటు చేసిన ఆఫీసర్లు ఈ ఏడాది చివరికల్లా6 లక్షల మొక్కలు అందిస్తామని చెబుతున్నారు.  సర్కారు లక్ష్యం నెరవేరాలంటే మూడేళ్లలో కోటి మొక్కలు అవసరం అవుతాయి.   మరిన్ని నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచితే తప్ప సకాలంలో అందించడం సాధ్యం కాదని రైతులు అంటున్నారు.

పల్లి రైతుల పరిస్థితి అంతే.. 

ఈ యాసంగి సీజన్​ ప్రారంభంలో సన్​ఫ్లవర్​ రైతుల లాగే పల్లి రైతులు సీడ్స్​ కోసం  కష్టాలు పడ్డారు. చివరికి అక్కడ ఇక్కడ తెచ్చి పంట వేస్తే మార్కెట్​లో మద్దతు ధర దక్కడం లేదు.  ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 3,57,211 ఎకరాల్లో పల్లి సాగుచేయగా, అందులో  ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోనే అత్యధికంగా 2,60,322 ఎకరాల్లో వేశారు. 2 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి రాగా, ప్రభుత్వం నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ప్రైవేట్​గా అమ్ముకుంటున్నారు. కేంద్రం మద్దతు ధర రూ.5,550 ఉండగా మార్కెట్​లోకి దిగుబడి రాకముందు ఓపెన్​ మార్కెట్​లో క్వింటాల్​పల్లి రూ.7,600 వరకు పలికింది. ఫిబ్రవరి నుంచి పంట రావడం మొదలయ్యాక ట్రేడర్లంతా ఏకమై రేటు తగ్గించడంతో ప్రస్తుతం రూ.4 వేలకు, ఒక దశలో రూ.3,200కు అమ్ముకుంటూ మునుగుతున్నారు.

పామాయిల్ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు

ఎస్సీ ఎస్టీ, చిన్న సన్నకారు రైతులు అనేక సంవత్సరాలుగా పామాయిల్​మొక్కల కోసం దరఖాస్తు చేసుకుంటున్నా ఇవ్వకుండా ఇతర జిల్లాల రైతులకు పంపిణీ చేస్తున్నారు. అశ్వరావుపేట నర్సరీ లో మొక్కల దొంగతనాలు జరుగుతున్నా, పోలీస్ కేసులు నమోదవుతున్నా ఆయిల్ ఫెడ్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు. అవినీతిని నిర్మూలించి పామాయిల్ రైతులకు న్యాయం చేయాలి.     

– కొక్కెరపాటి పుల్లయ్య, పామాయిల్ రైతు

పొద్దుతిరుగుడు పంటతో లక్షన్నర నష్టపోయిన

ఐదెకరాలు కౌలుకు తీసుకొని పొద్దుతిరుగుడు పంట సాగు చేసిన. అగ్రికల్చర్​ఆఫీసర్లను అడిగితే విత్తనాలు లేవన్నరు. ఓ ప్రైవేట్ కంపెనీ పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకొని వేశా. మొక్కలు ఎదిగి పూలు పూస్తున్నా, అందులో నూనె గింజలు మాత్రం ఏర్పడడం లేదు. మా ఊర్లో 40 మందికి పైగా రైతులం ఈ విత్తనాలనే సాగు చేశాం. అందరం ఎకరానికి రూ.30 వేల వరకు నష్టపోయాం.

– షేక్ సోందు, కౌలు రైతు, గోకినేపల్లి, ముదిగొండై