పెద్దాఫీసర్లకు కరోనా..ఆగిన ఫైళ్లు

పెద్దాఫీసర్లకు కరోనా..ఆగిన ఫైళ్లు
  • సర్కార్​ ఆఫీసుల్లో హాజరు అంతంతమాత్రమే
  • ఫైళ్లు ముట్టేందుకు భయపడుతున్న ఐఏఎస్​లు
  • ఎమర్జెన్సీ ఫైళ్లుంటేనే తీసుకురావాలని ఆదేశాలు
  • ఇంటి నుంచే పని చేస్తున్న సీనియర్​ ఆఫీసర్లు
  • విజిటర్స్​కు అనుమతి లేదంటూ బోర్డులు

హైదరాబాద్‌, వెలుగు: పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల ఎఫెక్ట్​ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనపైనా పడింది. బీఆర్కే భవన్​లోని తాత్కాలిక సెక్రటేరియట్​తోపాటు అన్ని ప్రభుత్వ శాఖల కమిషనరేట్లు, ఇతర ఆఫీసులలో పాలన దాదాపుగా స్తంభించిపోయింది. ఫైళ్లు పెండింగ్​లో పడిపోతున్నాయి. లాక్​డౌన్​ సడలింపులు కొనసాగుతున్నా.. గవర్నమెంట్ ఆఫీసుల్లో మాత్రం ఫుల్​ లాక్​డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా సీఎం ఆఫీసుతోపాటు, సెక్రటేరియట్, ఇతర ప్రభుత్వ శాఖల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

దీంతో తాము చెబితే తప్ప ఎవరూ ఫైళ్లు తీసుకురావొద్దని పలువురు ప్రిన్సిపల్​సెక్రెటరీలు, సీనియర్​ఆఫీసర్లు తమ కింది స్టాఫ్​కు ఆదేశిస్తున్నారు. సీఎం ఆఫీసు నుంచి అడిగినవి తప్ప ఏ ఫైళ్ల గురించి ఇప్పుడు చెప్పాల్సిన పని లేదని, ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే ఫోన్​లోనే అంతా వివరించి ఆతర్వాత ఫైల్​తీసుకురావాలని చెబుతున్నారు. తాము చెప్పినప్పుడే ఫైళ్లు తీసుకురావాలని, అది కూడా ఎప్పుడూ ఒకరే రావాలని సూచిస్తున్నారు.

అన్ని డిపార్ట్​మెంట్లలోనూ కరోనా కేసులు

కరోనా నివారణలో కీలకంగా ఉంటున్న డిపార్టెమెంట్​ఆఫీసర్లు, స్టాఫ్ లోనూ పలువురు కరోనా బారిన పడ్డారు. హెల్త్​డిపార్టుమెంట్లోనే దాదాపు 260 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. సెక్రటేరియట్​లోని హెల్త్​, కో ఆపరేషన్, మైనారిటీ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్లలోనూ కొందరికి కరోనా సోకింది. పోలీసు డిపార్ట్​మెంట్లోనూ190 మందికి పాజిటివ్​ వచ్చింది. జీహెచ్ఎంసీ స్టాఫ్​లోనూ పది మందికిపైగా కరోనా బారినపడ్డారు. కరోనా కట్టడిలో కీలకంగా పని చేసే శాఖలే కాకుండా మిగిలిన డిపార్ట్​మెంట్లోనూ కరోనా బాధితులు ఉన్నారు. ఇంటర్మీడియట్​బోర్డులో 12 మందికి, స్కూల్ ఎడ్యుకేషన్​ డైరెక్టరేట్​లో ఆరుగురికి, ఎస్పీడీసీఎల్ లో ఆరుగురికి వైరస్​ సోకింది. హైదరాబాద్​లోనే కాకుండా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో 21 మంది వైరస్​బారిన పడ్డారు. రాష్ట్రంలోని ఇతర గవర్నమెంట్​ ఆఫీసులలోనూ కేసులు రికార్డయ్యాయి.

50 శాతమే స్టాఫ్​ రావాలని ఆదేశాలు

కేసులు పెరుగుతుండడంతో అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో 50 శాతమే స్టాఫ్​ రావాలని జూన్​ 22న ప్రభుత్వం ఆర్డర్​ఇచ్చింది. ఈ నెల 4తో ఆదేశాల గడువు ముగుస్తోంది. ఈ ఆదేశాలను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘‘ఆఫీస్ సబార్డినేట్స్, డేటా ఎంట్రీ ఆఫీసర్స్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ 50 శాతం మంది వారం విడించి వారం ఆఫీసుకు రావాలి. క్లరికల్ స్టాఫ్ , సర్క్యులేటింగ్ ఆఫీసర్స్ సగం మంది రోజు విడిచి రోజు డ్యూటీకి రావాలి. ప్రత్యేక చాంబర్ ఉన్న ఆఫీసర్లు, స్టాఫ్​ప్రతి రోజు ఆఫీసుకు రావాలి. సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, క్లరికల్ స్టాఫ్, ఆఫీస్ సబార్డినేట్స్, డేటా ఎంట్రీ, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ ఉద్యోగులు డ్యూటీకి రాని రోజుల్లో తమ ఆఫీసు ఉన్న సిటీలోనే ఉండాలి. ఫోన్ చేయగానే డ్యూటీకి వెళ్లేలా అందుబాటులో ఉండాలి. ముందుస్తు పర్మిషన్ లేకుండా విజిటర్స్‌కు ఆఫీసులోకి అనుమతి లేదు’’ అని ఆర్డర్​లో ప్రభుత్వం పేర్కొంది.

హాజరు శాతం అంతంతే

ఫిజికల్​ డిస్టెన్స్​పాటించేంత స్థలం లేకపోవడంతో కొన్ని ఆఫీసుల్లో ఐదారుగురు స్టాఫ్​ కూడా ఉండడంలేదు. పలువురు సీనియర్​ ఆఫీసర్లు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆఫీసర్స్, స్టాఫ్ తక్కువగా వస్తుండడంతోపాటు కరోనా వైరస్​ వ్యాప్తి భయంతో గవర్నమెంట్​ఆఫీసులకు విజిటర్స్​ను అనుమతించడంలేదు. ‘కొవిడ్​‌‌‌‌–19 వైరస్​ కారణంగా విజిటర్స్​కు అనుమతి లేదు’ అని చాలా ఆఫీసులలో బోర్డులు పెట్టారు. సొంత శాఖలోని జిల్లాల్లో పని చేసే సిబ్బందికి ముందస్తు అనుమతి ఉంటేనే రావాలని స్పష్టం చేస్తున్నారు.

లాక్ డౌన్ పై సర్కారు డైలమా..సగం సిటీ ఖాళీ