
- త్వరలో ప్రకటించే అవకాశం
న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌లోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్టర్ల రిస్క్ తగ్గించే రూ.20 వేల కోట్ల ‘రిస్క్ గ్యారంటీ’ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పాలసీ అనిశ్చితి వల్ల కలిగే నష్టాలను కవర్ చేయడానికి దీనిని తీసుకురానుంది. ఈ ఫండ్‌ను నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ నిర్వహించనుంది. ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ (నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ అండ్ డెవలప్‌మెంట్) త్వరలో తన సిఫార్సులను కేంద్రానికి సబ్మిట్ చేయనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ ఫండ్ కొత్త ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుంది. భూమి స్వాధీనం, పర్యావరణ అనుమతులు వంటి కారణాలతో ప్రాజెక్టులు ఆలస్యం కావడం, ఖర్చులు పెరగడం వంటి అభివృద్ధి సంబంధిత రిస్క్‌లను ఇది కవర్ చేస్తుంది.
ప్రాజెక్ట్ డెవలపర్ల నియంత్రణలో లేని కారణాల వల్ల ఎదురయ్యే నష్టాలను తగ్గించడమే ఈ ఫండ్ లక్ష్యం. ఈ ఫండ్‌లో రిస్క్ ప్రీమియం ఎంత భాగాన్ని అధికార సంస్థలు, ఎంత భాగాన్ని డెవలపర్లు భరించాలి అనే అంశంపై ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ చర్చలు జరుపుతోంది. అలాగే, గ్యారంటీ ఎప్పుడు అమలులోకి రావాలి, అదనపు భద్రతా చర్యలు ఏమిటి అనే అంశాలపై కూడా సిఫార్సులు ఇవ్వనుంది. ఈ ఫండ్ ద్వారా పెద్ద ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు అప్పులు పెద్ద మొత్తంలో అందే అవకాశం ఉంది.
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఎక్కువ లోన్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపించొచ్చు. ఎన్‌ఏబీఎఫ్‌ఐడీని 2021లో ఏర్పాటు చేశారు. దేశ ఇన్‌ఫ్రా రంగానికి ఆర్థిక మద్దతు ఇవ్వడమే దీని ప్రధాన లక్ష్యం. భారతదేశం 2040 నాటికి ఇన్‌ఫ్రా రంగ అభివృద్ధికి సుమారు 4.5 లక్షల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.11.21 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని (జీడీపీలో 3.1 శాతాన్ని) కేటాయించింది.