
- రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ విభాగం
- ఆ లోగా ఆధార్ కార్డులు, బ్యాంక్ డిటెయిల్స్ ఇవ్వాలె
- లక్ష మంది బోగస్ ఉద్యోగులను గుర్తించిన త్రిమన్ కమిటీ
- ఏటా 1500 కోట్లు దుర్వినియోగమైనట్టు వెల్లడి
హైదరాబాద్: బోగస్ ఉద్యోగుల భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ నెల 25వ తేదీలోగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న వారు తమ ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో జీతాలు బంద్ చేస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో ఎంత మంది ఉద్యోగులున్నారనే విషయాన్ని తేల్చేందుకు త్రీమన్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లక్ష మంది బోగస్ ఉద్యోగులున్నారని నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా సర్కారు చర్యలు ప్రారంభించింది. లోతుగా ఆరా తీసేందుకు ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఏటా రూ. 1500 కోట్లు దుర్వినియోగం అయినట్టు త్రిమన్ కమిటీ తేల్చిన దరిమిలా.. ఆ డబ్బులు ఎవరికి చేరాయి.. అనే విషయాన్ని ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ పద్ధతిన 4 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. నిజంగా అంత మంది పని చేస్తున్నారా..? వారంతా విధుల్లో ఉంటున్నారా..? అనే అంశంపై 25వ తేదీ తర్వాత క్లారిటీ రానుంది. ఓ వైపు నిధుల దుర్వినియోగంపై ఆరా తీస్తూనే ఇంకా లెక్కలు చిక్కని వారెవరైనా ఉన్నారా..? అనే విషయంపై ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ విచారణ చేయనుంది. ఏయే శాఖలో ఎంత మంది ఉద్యోగులున్నారనే అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులు డిపార్టుమెంట్ల వారీగా ఆరా తీసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.