వరదల్లో దెబ్బతిన్న రోడ్లకు మళ్లీ ప్రపోజల్స్... ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో శాశ్వత పనులు

వరదల్లో దెబ్బతిన్న రోడ్లకు మళ్లీ ప్రపోజల్స్... ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో శాశ్వత పనులు
  • ఇప్పటికే ప్రపోజల్స్​పంపిన ఆర్ అండ్​బీ శాఖ
  • కేంద్ర స్కీమ్స్ వర్తించేలా మార్చి పంపాలని సీఎం రేవంత్ ఆదేశం
  • మరోసారి ప్రతిపాదనలు రెడీ చేస్తున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు:  వరదల్లో దెబ్బతిన్న రోడ్లకు ఆర్​అండ్ బీ ఆఫీసర్లు రీ ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన రోడ్లు, వంతెనలు రిపేర్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ కేంద్ర పథకం వర్తించేలా ప్రతిపాదనలు మార్చి పంపాలని అన్నారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్, మెదక్​ జిల్లాలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంజనీర్లు పర్యటించి ప్రపోజల్స్ రెడీ చేసే పనిలో నిమగ్నం అయ్యారు.

కొట్టుకుపోయిన 1,130 కి.మీ రోడ్లు

ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. అంతకుముందు పడిన వానలకు ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ నష్టాలు సంభవించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో 994 చోట్ల 1,130 కి.మీ రోడ్లు, 58 బ్రిడ్జిలు, 488 కల్వర్టులు దెబ్బతిన్నాయి. 421 చోట్ల రోడ్లు తెగిపోయి వాహనాల​ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికంగా కామారెడ్డి జిల్లాలో 64.74 కి.మీ రోడ్లు చెడిపోగా 19 బ్రిడ్జీలు, 47 కల్వర్టులు, మొదక్ జిల్లాలో 148 కి.మీ రోడ్లు, 11 బ్రిడ్జిలు, 41 కల్వర్టులు కొట్టుకుపోయాయి. 

అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 142, సంగారెడ్డిలో 72, నిజామాబాద్​లో 58 కి.మీ రోడ్లు పాడైనట్లుగా ఇంజనీర్లు తెలిపారు. మరికొన్ని జిల్లాలలో కూడా ఫ్లడ్ డ్యామేజీ భారీగా జరిగిందన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే రోడ్లు తెగిన చోట, వంతెనలు, కల్వర్టులు కొట్టుకుపోయిన చోట ఇంజనీర్లు రూ.69 కోట్లతో టెంపరరీ రిపేర్లు చేశారు. మట్టి, కంకర వంటివి పోసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పూర్తిగా బాగు చేసేందుకు రూ.1,136 కోట్లు అవసరం అని ఇంజనీర్లు సర్కారుకు నివేదిక పంపించారు.

సీఎం రేవంత్ ఆదేశాలతో రీ ప్రపోజల్స్​

సీఎం రేవంత్​రెడ్డి నాలుగు రోజుల కిందట కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. అక్కడ దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను స్వయంగా పరిశీలించారు. జిల్లా కలెక్టరేట్​లో అన్నీ శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.  ఫ్లడ్ డ్యామేజీ స్కీం కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులకు సంబంధించి రోడ్ల శాశ్వత పనులకు ప్రపోజల్స్ రెడీ చేసి పంపించాలని ఆర్ అండ్ బీ ఇంజనీర్లను సీఎం ఆదేశించారు. కేంద్రం పైసలు ఇచ్చినా.. ఇవ్వకున్నా పనులు పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి రెడీగా ఉందని చెప్పారు. 

కేంద్రం నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలో తాము చూసుకుంటామని కేంద్ర పథకాలకు అనుబంధంగా వర్క్​లకు సంబంధించిన ప్రపోజల్స్​రెడీ చేయాలని అన్నారు. దీంతో అన్నీ జిల్లాలలో ఇంజనీర్లు అంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. శాశ్వత పనులు చేపట్టేలా ప్రతిపాదనలు రెడీ చేయడానికి కొలతలు తీసుకుంటున్నారు.

పది రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తం

సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఫ్లడ్ డ్యామేజీ రోడ్లకు సంబంధించిన రీప్రపోజల్స్ రెడీ చేస్తు న్నం. ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కేంద్రం నిబంధనల ప్రకారం శాశ్వత రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు రెడీ చేసే పనిలోనే ఉన్నం. పది రోజుల్లో రిపోర్ట్ రెడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తం.మోహన్ నాయక్, ఇన్​చార్జ్ ఈఎన్​సీ, ఆర్ అండ్ బీ శాఖ