ఎంత‌మందికైనా చికిత్స అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ధం

ఎంత‌మందికైనా చికిత్స అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ధం

రాష్ట్రంలో ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి, వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 20 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. లాక్ డౌన్ అమలు, నిరుపేదలక సాయం అందించే విషయంలో ప్రజాప్రతినిథులు చూపిస్తున్న చొరవ, ప్రజల సహకారం కొనసాగాలని సిఎం ఆకాంక్షించారు.

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్ డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లు, అందుతున్న చికిత్స, భవిష్యత్ అవసరాల కోసం తీసుకుంటున్న చర్యలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, చికిత్స పొందుతున్న వారిలో బుధవారం ఎనిమిది మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, మరో 128 మంది గురువారం డిశ్చార్జి కానున్నారని వివరించారు.

‘‘కరోనా వైరస్ సోకిన వారి ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేసి, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతమందికైనా సరే, వైరస్ నిర్థారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో పిపిఇ కిట్లకు ఏమాత్రం కొరతలేదు. ఇప్పటికే 2.25 లక్షల పిపిఇ కిట్లు ఉన్నాయి. ఈ సంఖ్య కొద్ది రోజుల్లోనే 5 లక్షలకు చేరుకుంటుంది. మరో 5 లక్షల పిపిఇ కిట్లకు ఆర్డర్ ఇచ్చాం. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం 10 లక్షల పిపిఇ కిట్లను కలిగి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్ 95 మాస్కులున్నాయి. త్వరలోనే ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకంటుంది. మరో 5 లక్షలకు ఆర్డర్ ఇచ్చాం. దీంతో తెలంగాణలో 10 లక్షల ఎన్ 95 మాస్కులు అందుబాటులో ఉంటాయి. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 20 వేల బెడ్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. లక్ష మంది పేషెంట్లు అయినా సరే, చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసి పెట్టింది. కరోనాపై యుద్ధానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.