కరోనాపై హైకోర్టుకు నివేదిక ఇచ్చిన సర్కార్
23న మరోసారి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ 24కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్, వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్లో అదనంగా కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. ఉస్మానియా హాస్పిటిల్లో కూడా శుక్రవారం నుంచి పరీక్ష కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రోజుకు 500 మందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని ఐపీఎం డైరెక్టర్ శంకర్ హైకోర్టుకు వివరించారు.
మరిన్ని వివరాలతో నివేదిక ఇవ్వండి..
కేరళ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో మనం అనుసరించదగిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని విచారణ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు ఏజీ సమాధానమిస్తూ కేరళ చేపట్టిన చర్యలను అధ్యయనం చేసేందుకు ఇక్కడి డాక్టర్ల బృందం కేరళకు వెళ్లిందని తెలిపారు. అధిక ధరలకు మాస్క్‌లు, శానిటైజర్లు విక్రయిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. మాస్క్‌లు, శానిటైజర్లు అధిక ధరలకు అమ్మకుండా నిఘా పెట్టామని కోర్టుకు ఏజీ తెలిపారు. మరిన్ని వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 23లోగా సమర్పించాలని ఆదేశించింది. దీంతో తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
