అధికారులు గౌరవాన్ని  దిగజార్చుకునేలా వ్యవహరించొద్దు: ఐఏఎస్​ శరత్ తీరుపై ప్రభుత్వం సీరియస్​

అధికారులు గౌరవాన్ని  దిగజార్చుకునేలా వ్యవహరించొద్దు: ఐఏఎస్​ శరత్ తీరుపై ప్రభుత్వం సీరియస్​
  • సభలు, సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించొద్దు
  • ఐఏఎస్​ అధికారులు, ఉద్యోగులకు సీఎస్ మెమో జారీ
  • అచ్చంపేట సభలో​ఐఏఎస్​ శరత్ తీరుపై ప్రభుత్వం సీరియస్​
  • హద్దు మీరితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్ అధికారి శరత్ వ్యవహారం వివాదాస్పదం అయింది. సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిర సౌర గిరి జల వికాసం ప్రారంభం సందర్భంగా ట్రైబల్​వెల్ఫేర్​ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్​ శరత్.. సీఎం రేవంత్​ రెడ్డి కాళ్లు మొక్కారు. ఈ వ్యవహారంపై సీరియస్​అయిన సీఎం రేవంత్​రెడ్డి  ఆలిండియా సర్వీసు అధికారులతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించారు.

దీంతో సీఎస్​ రామకృష్ణారావు మెమో జారీ చేశారు. ఇందులో ప్రభుత్వ, ప్రజా సమావేశాల్లో అధికారులు అనుచితంగా ప్రవర్తించొద్దని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1968 ఏఐఎస్ రూల్స్ కు అనుగుణంగా మసలుకోవాలన్నారు. అధికారుల ప్రవర్తన ప్రజల్లో నమ్మకం పెరిగేలా ఉండాలి కానీ తగ్గేలా, నవ్వుల పాలయ్యేలా ఉండకూడదన్నారు.  

గతంలో  కేసీఆర్​ సీఎంగా ఉన్నప్పుడు కలెక్టరేట్లను ప్రారంభించడానికి వెళ్లినప్పుడు, ఇతర బహిరంగ సమావేశాల్లో అక్కడి అధికారులు, ఐఏఎస్ లు కొందరు కేసీఆర్ కాళ్లకు మొక్కారు. దీంతో ఐఏఎస్ అధికారులు పూర్తి స్థాయిలో గౌరవాన్ని కోల్పోతున్నారన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు అలాగే ఐఏఎస్ శరత్ కాళ్లు మొక్కడంతో.. ఆయన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు రూల్స్ పాటించేలా చూడాలని.. సీఎస్ కు సూచించినట్లుగా తెలుస్తోంది.  

మెమోలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొన్నప్పుడు వారి ప్రవర్తన, మాటతీరు ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని స్పష్టం చేశారు. అనుచితంగా ప్రవర్తించరాదని.. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించించారు. ఇటీవలి కాలంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు బహిరంగ సభలు, సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించడం, మాట్లాడటం చేస్తున్నారని ఇది ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

ఇలాంటి చర్యలు వ్యక్తిగతంగానే కాకుండా ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తీసుకువస్తున్నాయని సీఎస్​ ఈ  మెమోలో పేర్కొన్నారు. సచివాలయం కేంద్రంగా పనిచేసే అన్ని శాఖల సెక్రటరీలు, హెచ్ఓడీలు ఈ మేరకు చర్యలు తీసుకుని, తమ పరిధిలో పనిచేసే అధికారులు, ఉద్యోగుల ఈ ఆదేశాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.