తెలంగాణలో మరో 790 బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు

తెలంగాణలో మరో 790 బడుల్లో  ప్రీ ప్రైమరీ క్లాసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 790 బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులకు సర్కారు అనుమతించింది. ఈ ఏడాది ఇప్పటికే 210 స్కూళ్లకు అనుమతి ఇవ్వగా.. తాజా వాటితో కలిపి మొత్తం వెయ్యి బడులను ఈ అకడమిక్ ఇయర్‌‌‌‌నుంచే ప్రారంభిస్తున్నది. ఆయా బడుల్లో ఒక టీచర్, ఆయాను నియమించనున్నట్టు సర్కారు తాజాగా ప్రకటించింది. 

ప్రీ ప్రైమరీ స్కూళ్ల నిర్వహణకు సంబంధించిన గైడ్‌‌లైన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా శనివారం ఉత్తర్వులు జారీచేశారు.  రాష్ట్రంలో ఇప్పటికే సమగ్ర శిక్ష, పీఎం శ్రీ కింద 362 ప్రీ ప్రైమరీ స్కూళ్లున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 210 స్కూళ్లకు అనుమతులు ఇచ్చింది. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా  ప్రీ ప్రైమరీ  స్కూళ్ల సంఖ్య 1,362కు చేరింది. ఇందులో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. 

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో కొత్త ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 65 ఉండగా, సంగారెడ్డిలో 59, నిజామాబాద్‌‌లో 48, కామారెడ్డిలో 41 ఉన్నాయి. కాగా, ప్రీ ప్రైమరీ సెక్షన్ల పిల్లలకూ మిడ్డే మీల్స్ అందించనున్నారు. డబ్ల్యూడీసీడబ్ల్యూ శాఖ ద్వారా స్నాక్స్ అందించే ఏర్పాట్లు చేశారు. 

స్కూల్‌‌కు ఇద్దరు సిబ్బంది నియామకం

ప్రతి ప్రీప్రైమరీ సెక్షన్​కు ఇద్దరు సిబ్బందిని నియమించనున్నారు.  కనీసం ఇంటర్మీడియెట్​అర్హతతో ఇన్‌‌స్ట్రక్టర్, ఏడో తరగతి అర్హతతో ఆయాను నియమించుకోవాలని ఆదేశాలిచ్చారు. 18 – 44 ఏండ్లలోపు వారిని తీసుకోవాలని, 10 నెలలపాటు కాంట్రాక్టు పద్దతిలో వేతనాలు చెల్లించనున్నట్టు అధికారులు ప్రకటించారు. నెలకు టీచర్‌‌‌‌కు రూ. 10 వేలు, ఆయాకు 6  వేల వేతనం ఇవ్వనున్నారు.  ప్రీ ప్రైమరీ స్కూల్ ఉన్న గ్రామానికి చెందిన వారినే తీసుకోవాలని నిబంధన పెట్టారు. ఈ రిక్రూట్‌‌మెంట్‌‌ ​ ప్రక్రియను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ చేపట్టనున్నది.