సర్పంచ్​లకు సర్కార్​ బకాయి రూ.100 కోట్లు

సర్పంచ్​లకు సర్కార్​ బకాయి రూ.100 కోట్లు
  • ఒక్కొక్కరికీ రూ.5 లక్షలపైనే బాకీ 
  • ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు
  • ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సర్పంచులు

హైదరాబాద్, వెలుగు: అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, కానీ ఏడాదైనా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు విడుదల చేయట్లేదని సర్పంచ్​లు ఆవేదన వ్యక్తంచేశారు. బిల్లులురాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఒక్కో సర్పంచ్​కు సగటున రూ.5 లక్షల పైనే బిల్లులు రావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా పెండింగ్ బిల్లులు ఉన్నట్లు అంచనా. చేసిన అప్పులకు వడ్డీలు పెరగటం, బిల్లులు రాకపోవటంతో పలువురు సర్పంచ్​లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఏడాది కింద పైసలూ రాలే

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో గ్రామ పంచాయతీల్లో రైతు వేదికలను నిర్మించింది. ఒక్కో రైతు వేదికను రూ.18 లక్షల అంచనా వ్యయంతో నిర్మించగా.. ఇందులో రూ.12.5 లక్షలు కేంద్రం నిధులే. మిగతా నిధులను సర్పంచ్​లే సమకూర్చి ఏడాది కింద నిర్మాణాలు పూర్తిచేశారు. అయితే ఇంతవరకు వారికి బిల్లులు విడుదల కాలేదు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు ఇతర అభివృద్ధి పనుల బిల్లులకోసం కూడా సర్పంచ్ లు ఎదురుచూస్తున్నారు. ప్రతి నెలా పంచాయతీ కార్మికుల జీతాలు, ట్రాక్టర్ ఈఎంఐ, డీజిల్ ఖర్చులు, కరెంట్ బిల్లులు చెల్లించటానికి అప్పులు చేస్తున్నామని , వీటిపై వడ్డీ భారీగా పెరుగుతోందని సర్పంచ్​లు చెబుతున్నారు. ప్రతి నెలా కేంద్ర, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ల నిధులు ఆలస్యం అవుతుండటం, 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు ఇస్తుండటంతో అవి చాలా తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు.

నెలవారీ నిధులు ఆలస్యం

ప్రతి నెలా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వస్తున్న నిధులకు సమానంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. అయితే కేంద్ర నిధులు దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలతో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్​లకు బ్యాంకు అకౌంట్లు తీసి, నేరుగా నిధులు పంపాలని కేంద్రం నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు రాష్ట్రం ఒప్పుకోకపోవటం తో గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జులై ఇన్​స్టాల్​మెంట్ రాలేదని అధికారులు చెబుతున్నారు.

50 లక్షలు బిల్లులు పెండింగ్

మేం చేసిన పనులకు సంబంధించి రూ.50 లక్షలు బిల్స్ పెండింగ్​లో ఉన్నాయి. ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి పనులు చేపించినం. ఏడాది కింద నిర్మించిన రైతు వేదిక పనుల బిల్లు ఇంత వరకు రాలేదు. 18 నెలల నుంచి ఎస్ ఎఫ్ సీ నిధులు ఇవ్వటం లేదు. దీంతో కార్మికుల జీతాలకు నిధులు ఉండట్లేదు. కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నం. అప్పు కట్టాలని అప్పుల వాళ్లు వెంటబడుతున్నరు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయాలి.

- ధనలక్ష్మి, సర్పంచ్, తాటికోల్ గ్రామం, దేవరకొండ

బిల్లులు వచ్చేందుకు టైం పడ్తదట

రెండేండ్ల కింద శ్మశాన వాటిక కట్టినం. ఇంత వరకు దాని నిధులు రాలే. సీసీ రోడ్లు బిల్లులు కూడా రావాల్సి ఉంది. పనులు చేసి 9 నెలలు,  బిల్లులు చేసి ఇంకో 2 నెలలు అయితంది. బిల్లులు వచ్చేందుకు టైం పడ్తదని అధికారులు చెబుతున్నరు. పనులెట్ల చేయాలో అర్థం కాట్లే. ఇట్లయితే పల్లెలు ఎట్ల డెవలప్ అయితయి. బంగారు తెలంగాణ ఎట్ల అయితదో వారికే తెలవాలి.

- అలంపూర్​కు చెందిన దళిత మహిళా సర్పంచ్ ఆవేదన

అన్నీ క్లియర్ చేస్తున్నం

కేంద్రం నుంచి నిధులు రాగానే ఎప్పటికప్పుడు  క్లియర్ చేస్తున్నం. యుటిలైజేషన్ సర్టిఫికెట్లను వారంలో కేంద్రానికి అందచేస్తం. పేమెంట్లు జరగుతున్నయి. చేసిన పనులకు సంబంధించి వర్క్ అప్ లోడ్, రికార్డు చేయకపోవటం వల్ల బిల్లులు లేట్ గా వస్తయి. ఎఫ్ టీ వోలో వర్క్ అప్ లోడ్ అయితే ఫండ్స్ రిలీజ్ త్వరగా అవుతాయి. 

- ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ పీఆర్ శాఖ