- ప్రతి నెలా 21వ తేదీ నుంచి తదుపరి నెల 20 వరకు అటెండెన్స్
- జీతాల చెల్లింపుల్లో ఆలస్యమైతే బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే ఆయా శాఖల అధిపతులు, డీడీఓలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్నిచోట్ల బిల్లుల సమర్పించడంలో ఆలస్యం, ఇతర సాంకేతిక కారణాల వల్ల జీతాల చెల్లింపులు ఆలస్యమవుతుండటంపై ఇటీవల సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ స్పందిస్తూ.. ప్రతి నెలా 21వ తేదీ నుంచి తదుపరి నెల 20వ తేదీ వరకు హాజరును పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డీడీఓలు) ప్రతి నెలా 25వ తేదీ లోపు జీతాల బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీ కార్యాలయాలకు సమర్పించాలని, నెల చివరి పనిదినం నాటికి అధికారులు వాటి స్క్రూటినీ, ఆడిట్ ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించింది.
పరిపాలనాపరమైన లోపాల వల్ల జీతాల చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం జరిగినా సంబంధిత శాఖల అధిపతులు, డీడీఓలను బాధ్యులను చేస్తూ కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
కార్పొరేషన్లు.. వర్సిటీలు.. సొసైటీల్లో ఈ-కుబేర్ విధానం
గ్రాంట్- ఇన్- ఎయిడ్ సంస్థలు, వర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో ఈ-–కుబేర్ విధానం ద్వారా జీతాల చెల్లింపులను వేగవంతం చేసేందుకు, అలాగే ‘ఎస్‌ఎన్‌ఏ స్పర్ష్’ మోడ్యూల్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల (సీఎస్ఎస్) బిల్లుల ప్రక్రియను సులభతరం చేసేందుకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్(డీడీఓ) అధికారాల పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. గెజిటెడ్ అధికారులు లేని సంస్థల్లో అక్కడ డిప్యుటేషన్ లేదా ఫారిన్ సర్వీసులో ఉన్న ఏ ప్రభుత్వ గెజిటెడ్ అధికారికైనా ఈ బాధ్యతలను అప్పగించేందుకు అనుమతించింది.
ఒకవేళ ఎలాంటి గెజిటెడ్ అధికారి అందుబాటులో లేకపోతే, ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితో ఆయా సంస్థల అధిపతులు లేదా తదుపరి సీనియర్ అధికారికి జీతాల డ్రా, డిస్బర్స్‌మెంట్ కోసం పరిమిత అధికారాలు కల్పించవచ్చని స్పష్టంచేసింది. ఈ ఉత్తర్వుల అమలును పర్యవేక్షించే బాధ్యతను ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
