భూపాలపల్లి రూరల్, వెలుగు: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామంలోని భీంఘన్పూర్ చెరువులో మంగళవారం చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేపల పెంపకం వృత్తిగా ఉన్న ముదిరాజ్, గంగపుత్రుల ఆర్థికాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మత్స్య సహకార సంఘం నాయకులు పాల్గొన్నారు.
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం
తొర్రూరు, వెలుగు: మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు మండలంలోని అమ్మాపురం పెద్ద చెరువులో మంగళవారం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, మత్స్యశాఖ అధికారులతో కలిసి చేపపిల్లలను వదిలారు. జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ రమేశ్ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడి పారి, తెగిపోవడం వల్ల మత్స్యకారులకు నష్టం జరిగిందని, పరిహారం చెల్లించాలని కోరారు.
అమ్మాపురం చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని రిపేర్చేయించాలన్నారు. పెద్దవంగర మండల కేంద్రంలో 33/11 కేవీ విద్యుత్ఉపకేంద్రం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ముత్తినేని సోమేశ్వరరావు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
