ప్రభుత్వం చేతికి మెట్రో ...ఫేజ్–1 టేకోవర్‌‌‌‌‌‌‌‌కు సూత్రప్రాయ అంగీకారం

ప్రభుత్వం చేతికి మెట్రో ...ఫేజ్–1 టేకోవర్‌‌‌‌‌‌‌‌కు సూత్రప్రాయ అంగీకారం
  • వన్​టైమ్‌‌‌‌ సెటిల్‌‌‌‌మెంట్ ​కింద ఎల్అండ్​టీకి రూ.2 వేల కోట్లు
  • ఎల్‌‌‌‌అండ్​టీ మెట్రో రుణం రూ.13 వేల కోట్లు సర్కార్‌‌‌‌‌‌‌‌కు బదిలీ 
  • సీఎం రేవంత్ రెడ్డి, ఎల్అండ్​టీ చైర్మన్ సుబ్రమణ్యన్ మధ్య చర్చలు 
  • మెట్రో ఫేజ్2 ప్రాజెక్టులో భాగస్వామి కావాలని ఎల్‌‌‌‌అండ్‌‌‌‌టీని కోరిన సర్కార్
  • నిరాకరించిన సంస్థ.. ఫేజ్‌‌‌‌1లో తమ వాటాను వదులుకోవడానికి సిద్ధమని వెల్లడి 
  • ఫేజ్1 టేకోవర్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం నిర్ణయం.. మెట్రో విస్తరణకు లైన్​ క్లియర్ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి దాన్ని పూర్తిగా టేకోవర్ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. 

ఎల్ అండ్​ టీ కూడా తమ వాటాను వదులుకోవడానికి సుముఖత వ్యక్తం చేయడంతో రూ.13 వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం స్వీకరించి, ఎల్ అండ్ టీకి వన్ టైమ్ సెటిల్‌‌‌‌మెంట్ కింద రూ.2 వేల కోట్లు చెల్లించేలా ప్రాథమికంగా ఒప్పందం కుదుర్చుకుంది.

 దీంతో ప్రస్తుతం ఫేజ్ –1లో ఉన్న మూడు కారిడార్ల పరిధిలో 72 కిలోమీటర్ల మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. గురువారం హైదరాబాద్‌‌‌‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ అండ్ టీ గ్రూప్ చైర్మన్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్‌‌‌‌ మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది.

ఫేజ్ 2లో ఉండేందుకు ఎల్​అండ్​టీ నో..  

పెరుగుతున్న డిమాండ్‌‌‌‌కు అనుగుణంగా మెట్రోను సిటీ నలుమూలలా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫేజ్ –1 లో ఇప్పుడున్న మూడు కారిడార్లకు తోడు ఫేజ్ –2 కింద పార్ట్–ఏ, పార్ట్ –బీ లో మరో 8 కారిడార్లను, 163 కిలోమీటర్ల మేర విస్తరించాలని నిర్ణయించింది. ఫేజ్–2 ను మొత్తం ప్రభుత్వమే నిర్మించి, నిర్వహించాలని భావిస్తోంది. 

ఈ కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌‌‌‌లు పూర్తయి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. కానీ ఫేజ్–1 ను ప్రైవేట్ సంస్థ అయిన ఎల్ అండ్ టీ నిర్వహిస్తుండగా, ఫేజ్-2ను ప్రభుత్వ చేపట్టడంపై కేంద్ర ప్రభుత్వం పలు అనుమానాలను వ్యక్తం చేసింది. ప్రైవేట్, ప్రభు త్వ నిర్వహణలో సమన్వయంతో ఎలా ముందుకు వెళ్తారు?  కారిడార్ల మధ్య టికెట్ షేరింగ్ ఎలా ఉంటుంది? అంటూ పలు అనుమానాలను వ్యక్తం చేసింది. 

ఫేజ్ –1 , ఫేజ్ –2 నిర్వహణ సక్రమంగా జరిగేందుకు ఫేజ్–2 పార్ట్ ఏ, పార్ట బీలో కూడా ఎల్ అండ్ టీని ఈక్విటీ భాగస్వామిగా చేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని.. ఎల్ అండ్ టీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. మెట్రో ఫేజ్‌‌ 2లోనూ ఎల్ అండ్ టీ పాలు పంచుకుంటే బాగుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన ప్రాధాన్యం ఇస్తుందని సీఎం హామీ ఇచ్చారు.  

ఫేజ్‌‌–1, ఫేజ్‌‌ 2 కారిడార్ల మధ్య ఉమ్మడి కార్యాచరణకు ఒప్పందం అవసరమని సీఎం సూచించారు. ఈ ఒప్పందం కుదిరితేనే మెట్రో విస్తరణ సాధ్యమవుతుందని, ఆదాయ వ్యయాల భాగస్వామ్యంలో స్పష్టత ఉంటుందని ఎల్ అండ్ టీకి సీఎం తెలిపారు. 

కానీ రవాణా సంబంధిత వ్యాపారం నుంచి ఎల్ అండ్ టీ కంపెనీ తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం వల్ల తమ కంపెనీ ఫేజ్ –2 లో ఈక్విటీ భాగస్వామిగా ఉండలేదని ఎల్ అండ్ టీ సీఎండీ స్పష్టం చేశారు. బదులుగా ఫేజ్ –1లో తమ వాటాను రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వానికి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 

ఫేజ్‌‌–2 కోసమే టేకోవర్.. 

ఈ సమావేశంలో ఫేజ్–1కు సంబంధించి అప్పులు, ఆస్తులపై సుదీర్ఘ చర్చ జరిగింది. సమస్య కొలిక్కి రాకపోవడంతో ఫేజ్–1ను టేకోవర్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మెట్రో విస్తరణ ముందుకు సాగాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి సర్కారుకు ఏర్పడింది. 2022లో అప్పటి ప్రభుత్వం రూ.3వేల కోట్లను ఎల్ అండ్ టీకి వడ్డీ లేని రుణం ఇస్తామని అంగీకరించిందని, ఇంకా రూ.2,100 కోట్ల బకాయిలు ఇవ్వలేదని ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ గ్రూప్ చైర్మన్ సుబ్రమణ్యన్ గుర్తుచేశారు. 

ఈక్విటీ వాటా కింద రూ.2వేల కోట్లు చెల్లించాలని ప్రతిపాదించారు. దీంతోపాటు  ప్రస్తుతం ఎల్ అండ్ టీ మెట్రోపై ఉన్న రూ.13వేల కోట్ల అప్పులను కూడా  ప్రభుత్వం స్వీకరించనుంది. ఆర్థిక ఒప్పందాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ చర్యతో  మెట్రో ఫేజ్–2  విస్తరణ వేగవంతమవుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు త్వరగా వచ్చే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మెట్రో విస్తరణకు లైన్ క్లియర్... 

ఫేజ్-1ను స్వాధీనం చేసుకుంటే ఫేజ్–2 అనుమతులు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫేజ్ 1లో ప్రైవేట్, ఫేజ్ –2 లో  ప్రభుత్వ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో... గతేడాది నవంబర్ నుంచి డీపీఆర్‌‌‌‌లు కేంద్రం వద్దే పెండింగ్ లో ఉన్నాయి. తాజా నిర్ణయంతో మెట్రో మొత్తం ప్రభుత్వం అధీనంలోకి రానుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం డీపీఆర్​లను తొందరగా ఆమోదించే అవకాశం ఉంది. ఎనిమిది కారిడార్ల పరిధిలో 163 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. 

సెంకడ్ ఫేజ్ లో ఓల్డ్ సిటీ మెట్రోతో పాటు, ఎయిర్ పోర్టు, మేడ్చల్, శామీర్ పేట్, పటాన్‌‌చెరు, ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో సేవలు విస్తరించనున్నాయి. దేశంలో మెజారిటీ మెట్రోలు ప్రభుత్వ అధీనంలో నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి సిటీల్లో మెట్రోలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌‌గా ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) నడుపుతున్నాయి. 

తాజా నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో కూడా దేశంలోని ఇతర మెట్రోల మాదిరిగానే ప్రభుత్వ అధీనంలోకి రానుంది. ఈ సమావేశంలో సీఎస్ కె.రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు (అర్భన్ ట్రాన్స్ పోర్టు) ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ శాఖ కార్యదర్శి కె.ఇలంబర్తి, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఎల్ అండ్ టీ సంస్థ సలహాదారు డీకే సేన్, ఎల్ అండ్ టీ ఎంఆర్‌‌‌‌హెచ్ఎల్‌‌ ఎండీ,  సీఈవో కేవీబీ రెడ్డి హాజరయ్యారు. 

నిర్వహణ లోపం  వల్లే అప్పులు..

రోజురోజుకూ పెరిగిపోతున్న ఆర్థిక భారం కారణంగా మెట్రో ఫేజ్ –1ను నిర్వహించడం కష్టమవుతోందని గత కొన్నేండ్లుగా ఎల్ అండ్ టీ వాదిస్తోంది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. తాము మెట్రో నిర్వహణను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. 

ప్రయాణికుల సంఖ్య అనుకున్న స్థాయిలో లేకపోవడం, కరోనా సమయంలో మెట్రో మూతపడటం, అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడం వల్ల ఆర్థిక భారం పెరుగుతోందని చెప్పింది. కాగా ఎల్ అండ్ టీ నిర్వహణ లోపం వల్లే అప్పులు పెరిగాయనే విమర్శలూ ఉన్నాయి. 

ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులను సరిగ్గా వినియోగించుకోలేపోయిందనే వాదనలు ఉన్నాయి. ఇటీవల మెట్రోను ఆదుకోవడానికి ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపునకు సైతం ఓకే చెప్పింది. అయినప్పటికీ అప్పుల సాకుతో ఎల్​అండ్​టీ మాటిమాటికీ సర్కారును బ్లాక్​మెయిల్​చేస్తూ వచ్చింది. దీంతో టేకోవర్ నిర్ణయం తీసుకుని నాలుగైదేండ్లుగా నానుతున్న సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.