- పాలనా ప్రగతి నివేదికలో వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
- ప్రజా పాలనలో తీసుకున్న చర్యల జాబితా విడుదల
హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తమ పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి నివేదికను విడుదల చేసింది. ప్రజా పాలనలో భాగంగా 24 నెలల్లో వివిధ రంగాలకు సంబంధించి మొత్తం 240 కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతులు, పరిపాలన సంస్కరణలే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉన్నాయని వెల్లడించింది.
జాబితాలోని ముఖ్యాంశాలు..
ప్రభుత్వం విడుదల చేసిన ఈ 240 నిర్ణయాల జాబితాలో ప్రధానంగా రైతు రుణమాఫీ (రూ. 20,616 కోట్లు), సన్న వడ్లకు బోనస్, రైతు భరోసాలాంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలున్నాయి. అలాగే ఆరు గ్యారంటీల అమలులో భాగంగాఉచిత బస్సు, రూ.500కే గ్యాస్, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీలాంటి నిర్ణయాలను పొందుపరిచారు.
ఉద్యోగ నియామకాలు - పాలనా సంస్కరణలు
యువతకు ఉపాధి కల్పనలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు జాబితాలో ప్రాధాన్యతనిచ్చారు. 61,379 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, గ్రూప్స్, -డీఎస్సీ నిర్వహణ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటులాంటి అంశాలను ప్రస్తావించారు. అలాగే పాలనాపరంగా కుల గణన సర్వే, ధరణి స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్
హైదరాబాద్‌ను ‘ఫ్యూచర్ సిటీ’గా మార్చే దిశగా తీసుకున్న నిర్ణయాలను కూడా నివేదికలో చేర్చారు. మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, హైడ్రా ఏర్పాటు, ట్రిపుల్ఆర్, దావోస్ ఒప్పందాలు, పెట్టుబడుల ఆకర్షణ లాంటి అంశాలు ఈ 240 నిర్ణయాల్లో భాగమని ప్రభుత్వం తెలిపింది. రెండేండ్లలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని ప్రభుత్వం తెలిపింది.
