గరీబోళ్ల భూములే దొరికినయా సారూ..

గరీబోళ్ల భూములే దొరికినయా సారూ..

పార్కులు, రైతు వేదికలు, శ్మశానవాటికల కోసం లాక్కుంటున్న సర్కారు
పూటకు లేని పేదోళ్లం..మా భూమి లాక్కుంటరా?
దళితులు, గిరిజనులు, ఇతర పేదలకు పంచిన గత ప్రభుత్వాలు
అసైన్డ్, శిఖం, పోడు అంటూ పట్టాలివ్వని నేటి పాలకులు
బువ్వ పెట్టిన భూమి పోతాంటే బాధితుల కన్నీరు మున్నీరు

‘సారూ.. 50 ఏండ్లుగా ఈ భూములను సాగుచేసుకుంటున్నం బాంచెన్.. మా నోటికాడి బుక్కను లాక్కోకుండ్రి.. మీకు పుణ్యముంటది..’ అంటూ తమ భూమిలో మొక్కలు నాటేందుకు వచ్చిన ఆఫీసర్ల కాళ్ల మీద పడి మహిళా రైతులు ఇలా వేడుకున్నారు. ఈ దృశ్యం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాధవానిపల్లి గ్రామంలోనిది.

పార్కు కోసం ఇండ్లు ఖాళీ చేయల్నట. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో ముంపు గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాలు 1972 నుంచి జీవిస్తున్నాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి కాలనీలో కొంత స్థలాన్ని అలాట్ చేస్తే అర్బన్ పార్కు కోసం టీఆర్ఎస్ సర్కారు ఖాళీ చేయిస్తోంది. ఇటీవలే వీరికి ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు. తాము 48 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఉన్నఫలంగా పొమ్మంటే ఎటుపోవాలో తెలియడం లేదని లక్ష్మీ నర్సయ్య వాపోయాడు.

వెలుగు, నెట్వర్క్: వాళ్లంతా నిరుపేదలు, అందులోనూ అత్యధికులు దళితులు, గిరిజనులు. కాంగ్రెస్, టీడీపీ హయాంలలో నాటి పాలకులు రకరకాల సందర్భాల్లో భూమి లేని పేద కుటుంబాలకు ఎకరా, అరెకరా అన్నట్లుగా అన్ని జిల్లాల్లో నూ ల్యాండ్స్ అందజేశారు. అసైన్డ్ (లావాణి), శిఖం, పోడు భూములుగా పిలిచే చాలా భూములకు హక్కుపత్రాలు, పట్టాలు ఇచ్చినా మోఖా మీద చూపలేదు. రెవెన్యూ శాఖతో సర్వే చేయించి, కొత్త పట్టాపాస్ బుక్లు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వకుండా హరితహారం, పార్కులు, రైతు వేదికలు, డంపుయార్డులు, శ్మశానవాటికల పేరిట భూములను లాక్కోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

పోడు భూముల్లో మొక్కలు
పాత ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ప్రధానంగా పోడుభూముల సమస్య ఉంది. 2006లో అప్పటి సీఎం వైఎస్ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు ఫారెస్ట్ర్ రైట్ యాక్ట్ పత్రాలు అందించారు. 1,83,107 మంది గిరిజనులు దరఖాస్తు చేసుకుంటే 93,494 మందికి హక్కు పత్రాలు అందించారు. వివిధ కారణాలతో 80,890 అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. 8వేలకు పైగా అప్లికేషన్లను పెండింగ్లో పెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కొత్తవాళ్లేవరికీ హక్కుపత్రాలు ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోడు భూముల సమస్య తీరుస్తానని స్వయంగా సీఎం హామీ ఇచ్చిఅమలు చేయలేదు. భూముల హద్దులు తేల్చే రెవెన్యూ, ఫారెస్ట్ జాయింట్ సర్వే చేయించలేదు. దీంతో ఏటా వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 7లక్షలకు పైగా ఎకరాల్లో పోడు చిచ్చు రగులుతోంది. అంగుళం భూమికూడా వదలకుండా మొక్కలు నాటాలని ఫారెస్టోళ్లకు సర్కారు టార్గెట్లు పెడుతోంది. దీంతో ఏటా వర్షాకాలంలో పంటలు వేసేందుకు గిరిజనులు, మొక్కలు నాటేందుకు ఫారెస్టోళ్లు వస్తుండడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది.

అసైన్డ్ భూముల్లో రైతువేదికలు, శ్మశానవాటికలు
పల్లెప్రగతిలో భాగంగా ప్రభుత్వం ఊరూరా శ్మశాన వాటికలు, డంపుయార్డులు, ఎకరా భూమిలో ప్రకృతి వనాలు, అగ్రికల్చర్ క్లస్టర్ల పరిధిలో రైతువేదికలు నిర్మిస్తోంది. వీటికోసం ప్రభుత్వ భూములు లేకపోవడంతో గతంలో పేదలకిచ్చిన అసైన్డ్, లావాణి భూములను ఆఫీసర్లు వెనక్కి తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఇండ్లను కూడా ఖాళీ చేయిస్తున్నారు. తాము నిరుపేదలమనే గత ప్రభుత్వాలు పంట భూములు, ఇండ్లస్థలాలు ఇచ్చాయని, వాటిని తీసుకుంటే తాము ఎట్లా బతకాలని, ఎక్కడికి వెళ్లాలని నిరుపేదలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో తన 13 గుంటల భూమిని రైతువేదిక కోసం తీసుకోవడంతో రైతు బ్యాగరి నర్సింలు పొలంలో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.

ఇదెక్కడి న్యాయం?
40 ఏండ్లకింద కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో ఈ సర్కారు లాక్కోవాలని చూస్తాంది. వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలంలో చాలా ప్రభుత్వ భూములు ఉండగా, కొందరు టీఆర్ఎస్ లీడర్లుకావాలనే మా భూముల దగ్గరికి వస్తున్నరు. మొన్న వచ్చి కంప చెట్లు తొలగించిన్రు. మా అసొంటి పేదోళ్లే దొరికిన్రా. ఇదెక్కడి న్యాయం?

‑నందిపేట పెద్ద నాగన్న, రైతు, వీరాయిపల్లి, వనపర్తి జిల్లా

For More News..

రాఖీ కట్టేందుకు వస్తూ.. అన్న కళ్లెదుటే చెల్లెలి మృతి