- కాళ్లలో కట్టెలు పెట్టినా అభివృద్ధి, సంక్షేమం ఆగదు: మంత్రి పొంగులేటి
- 144 మంది లబ్ధిదారులకు ‘డబుల్’ ఇండ్ల పట్టాలు పంపిణీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే నాలుగేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్కలెక్టరేట్లో గోషామహల్ కు చెందిన 144 మంది పేద కుటుంబాలకు డబుల్బెడ్రూమ్ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటాను అడిగి తీసుకుంటామన్నారు. కేంద్ర హౌసింగ్ జాయింట్ సెక్రటరీని పెద్ద ఎత్తున ఇండ్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందుల ఎదురైనా, ప్రతిపక్షాలు కాళ్లల్లో కట్టెలు పెట్టినా అభివృద్ధి, సంక్షేమం ఆగదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదని, అప్పుడే బీఆర్ఎస్నేతలు రోడ్డెక్కి గగ్గోలు పెట్టడంలో అర్థం లేదన్నారు. 10 ఏండ్లలో బీఆర్ఎస్ప్రభుత్వం చేయలేని పనులను తాము 10 నెలల్లో చేసి చూపిస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతవాసులకు ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి కల్పిస్తుంటే ఓర్చుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తున్నాయని, మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నాయని మండిపడ్డారు.
మూసీ రివర్బెడ్బాధితులకు ఇండ్లతోపాటు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే ఓర్వలేకపోతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన ఎలా చేయాలో, ప్రతిపక్షాలకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో తెలుసు అన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ గోషామహల్ నియోజక వర్గములోని144 మంది పేదలకు ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా మేడ్చల్‌జిల్లా రాంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి పట్టాలు అందజేశామని చెఉప్పారు. దీపావళి తర్వాత ఇండ్లలోకి వెళ్లాలని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజాసింగ్, శ్రీగణేష్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, అడిషనల్కలెక్టర్ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.