మరోసారి హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం... మోకిలలో 100 ప్లాట్లు, మేడిపల్లిలో 68 ప్లాట్లు.. రూ.3 వేల 500 కోట్ల ఆదాయంపై ప్రభుత్వం దృష్టి

మరోసారి హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం... మోకిలలో 100 ప్లాట్లు, మేడిపల్లిలో 68 ప్లాట్లు.. రూ.3 వేల 500 కోట్ల ఆదాయంపై ప్రభుత్వం దృష్టి
  • హకీంపేటలో 8.24 ఎకరాల భూమి వేలానికి సిద్ధం
  • జూన్ 17, 19, 24, 29వ తేదీల్లో ఈ-వేలానికి సన్నాహాలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో హెచ్ఎండీఏ అధికారులు మరోసారి ప్లాట్ల వేలానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి వేలం ద్వారా కనీసం రూ.3,500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం ద్వారా భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది. హెచ్ఎండీఏ ప్లాట్లు అంటేనే కొనుగోలుదారులకు మంచి నమ్మకం ఉంటుంది. 

క్లియర్ టైటిల్, నిబంధనల ప్రకారం లేఔట్లు వేసి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ప్లాట్లను వేస్తారు. వీటిని కొనుగోలు చేసిన వారికి భవిష్యత్​లో ఎలాంటి ఇబ్బంది లేకుండా భరోసా కల్పిస్తారు. అందుకే హెచ్ఎండీఏ ప్లాట్లకు మంచి డిమాండ్ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం కోకాపేట, నియోపొలిస్ లేఔట్​లో నిర్వహించిన భూముల వేలానికి భారీ స్పందన లభించింది. ఏకంగా ఎకరానికి రూ.150 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. 

తాజాగా మరికొన్ని చోట్ల భూముల వేలానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉప్పల్ భగాయత్, కోకాపేట, బుద్వేల్, తెల్లాపూర్, కీసర, బాటసింగారం, ప్రతాపసింగారం వంటి ప్రాంతాల్లో హెచ్ఎండీఏ భారీ ఎత్తున లేఔట్స్ వేసి భూముల అమ్మకాలు చేసింది. అప్పట్లో దీనికి కూడా మంచి రెస్పాన్స్​వచ్చింది. కోకాపేట, నియోపొలిస్ లేఔట్​లలో భూముల వేలం ద్వారానే హెచ్ఎండీఏ రూ.3,862.8 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. ఈసారి కూడా కొన్ని ప్లాట్లకు ఆదరణ లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.  

మిడిల్​క్లాస్ ​ను దృష్టిలో పెట్టుకుని.. 

ఈసారి సంపన్న వర్గాలనే కాకుండా మిడిల్ క్లాస్​ను కూడా దృష్టిలో పెట్టుకుని ప్లాట్లను సిద్ధం చేశారు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్​ పుంజుకుంటున్నదని ఈసారి కూడా వేలానికి భారీ స్పందన వస్తుందని అధికారులు నమ్మకంగా ఉన్నారు. మోకిలాలో 100 ప్లాట్లు, మేడిపల్లిలో 68 ప్లాట్లు, హాకీంపేటలో 8.24 ఎకరాల భూమి వేలానికి హెచ్ఎండీఏ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మోకిలా, మేడిపల్లి ప్లాట్ల విక్రయం ద్వారా రూ.400 కోట్లు, హాకీంపేటలోని 8.24 ఎకరాల విక్రయం ద్వారా రూ.1,600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. 

మరోవైపు శేరిలింగంపల్లి మండలం చందానగర్ లో​సర్వే నెంబర్ 174లోని 484 గజాలు, గండిపేట మండలం బైరాగిగూడలోని సర్వే నెంబర్ 57లోని 2,420 గజాలు, నార్సింగిలోని సర్వే నెంబర్ 105లోని 5,687 గజాలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గండిమైసమ్మ మండలం భౌరంపేటలోని సర్వే నంబర్ 694లో ఉన్న 2,420 గజాలు, కుత్బుల్లాపూర్ మండలం సూరారంలోని సర్వే నెంబర్ 166, 167లోని 4,840 గజాలు, మేడిపల్లి మండలం పీర్జాదిగూడలోని సర్వే నెంబర్199లో ఉన్న 2,057 గజాలు, 726 గజాల భూమి వేలం వేయానికి నిర్ణయించారు. ఈ వేలం ద్వారా కనీసం 3,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.  

జూన్ 17 నుంచి వేలం

హెచ్ఎండీఏ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థలాలను వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ–వేలం ద్వారానే భూముల అమ్మకాల ప్రక్రియ నిర్వహించనున్నారు. జూన్ 17న ఏడు ప్రాంతాల్లోని స్థలాలకు, 19వ తేదీన హాకీంపేటలోని 8.24 ఎకరాల భూమికి, 24వ తేదీన మేడిపల్లిలోని ప్లాట్లకు, జూన్ 29వ తేదీన మోకిలాలోని ప్లాట్లకు వేలం వేయనున్నట్లు హెచ్ఎండీఏ తెలిపింది. 

హెచ్ఎండీఏ పరిధిలో భారీ ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకే ఈ భూములను వేలం వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.