
- రాష్ట్రంలో 20 లక్షల కొత్త రేషన్ కార్డులు: వివేక్ వెంకటస్వామి
- పదేండ్లలో బీఆర్‌ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలె
- కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు
- కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ప్రోసిడింగ్స్ అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు:రాష్ట్రంలో కొత్తగా 20 లక్షల కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు. అయితే, పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ప్రజలకు ఇవ్వలేదని ఆరోపించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో 677 మందికి కొత్త రేషన్ కార్డులు, 526 మందికి ఇందిరమ్మ ఇండ్ల ప్రోసిడింగ్స్‌ను వివేక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్ రావు, ఎంపీడీవో మోహన్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు చెన్నూరు మున్సిపాలిటీలోని 6వ, 12వ వార్డుల్లో కొత్తగా రెండు బోర్లను ప్రారంభించి, మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఫ్యామిలీ కార్డుల రూపంలో రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఈ కార్డు ఉంటే అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారని తెలిపారు.
కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టిండు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీరందించేందుకు రూ.38 వేల కోట్లతో ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టును మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి మంజూరు చేయించారని, అప్పటి కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.11 వేల కోట్లను ఖర్చు చేసిందని వివేక్ వివరించారు. మరో రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కమీషన్లకు ఆశపడి ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించారన్నారు. రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టు నిర్మించి, ప్రజల సొమ్మును వృథా చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం లేకున్నా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం ప్రొక్యూర్చేశామని తెలిపారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారన్నారు. కాళేశ్వరం పేరుతో వృథా చేసిన రూ.లక్ష కోట్లతో రాష్ట్రంలోని పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ఇండ్లు కట్టించే అవకాశం ఉండేదన్నారు.
ప్రజలకు ఇండ్లు కట్టించలేని కేసీఆర్ మాత్రం తన కోసం100 పడకల ప్రగతి భవన్, తన కొడుకు, కుటుంబ సభ్యులకు వందల పడకలతో ఫామ్ హౌస్‌లు కట్టించుకున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు దక్కాయని, మళ్లీ కాంగ్రెస్ వచ్చాకే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను సాంక్షన్ చేశామన్నారు. అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వం నిర్దేశించినట్టు 600 స్క్వేర్ ఫీట్లలో ఇల్లు కట్టుకుంటే డబ్బులు మంజూరు అవుతాయని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన దొడ్డు బియ్యం ఎవరు తినలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందని చెప్పారు. సన్న వడ్లు పండించే రైతులకు రూ.500 బోనస్‌ను కూడా అందిస్తుందని చెప్పారు.
తాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు..
మంచిర్యాల జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగు నీటి సౌలతుల కోసం నిధులు మంజూరు చేసినట్లు వివేక్ వెంకటస్వామి తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వారి ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. క్యాతనపల్లి, చెన్నూరు, మందమర్రి మున్సిపాలిటీల్లో రూ.100 కోట్లతో అమృత్ స్కీం పనులు కొనసాగుతున్నాయని, వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా 200 బోర్లు మంజూరు చేశామన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాకు రూ.30 కోట్లతో అమృత్ స్కీం సాంక్షన్ చేశామని, గోదావరి నుంచి డ్రింకింగ్ వాటర్ సరఫరాకు మరో స్కీం మంజూరు చేయిస్తానని వెల్లడించారు.
చెన్నూరు మండలం సోమనపల్లిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, చెన్నూరు నియోజకవర్గంలోని స్కూళ్లలో కనీస వసతులు, అదనపు తరగతి గదులు, రిపేర్ల కోసం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. పదేండ్లలో బీఆర్‌ఎస్ సర్కార్ సీఎం రిలీప్ ఫండ్కింద రూ.400 కోట్లు సాంక్షన్ చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే రూ.900 కోట్లు మంజూరు చేసిందన్నారు.