తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు

తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు
  • ఒక్కో కాలేజీకి వంద సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి 
  • రాష్ట్రంలో 10 వేలు దాటనున్న ఎంబీబీఎస్ సీట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గద్వాల, వరంగల్(నర్సంపేట్), యాదాద్రి, మేడ్చల్ (కుత్బుల్లాపూర్), నారాయణపేట్, ములుగు, మెదక్, రంగారెడ్డి(మహేశ్వరం) జిల్లాల్లో కాలేజీల ఏర్పాటుకు అనుమతులు కోరుతూ నేషనల్ మెడికల్ కమిషన్‌‌‌‌ (ఎన్ఎంసీ)కు  మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్ దరఖాస్తులు పంపింది. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. ఇప్పటికే 25 జిల్లాల్లో కాలేజీలు ఉండగా, ఇప్పుడు మరో 8 కాలేజీల ఏర్పాటు కోసం ఎన్ఎంసీకి అప్లికేషన్లు పంపించింది. ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తే మొత్తం ప్రభుత్వ కాలేజీల సంఖ్య 34కు(హైదరాబాద్‌‌‌‌ జిల్లాలో గాంధీ, ఉస్మానియా) చేరుతుంది. ఇవిగాక కేంద్ర ప్రభుత్వ పరిధిలో సనత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని ఈఎస్‌‌‌‌ఐ మెడికల్ కాలేజీ, భువనగిరిలో ఎయిమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.  

భారీగా పెరగనున్న సీట్లు.. 

ఈ పదేండ్లలో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌‌‌‌ సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 2,850 సీట్లు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 8,515కు పెరిగింది. ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసిన ఒక్కో కాలేజీకి వంద సీట్ల చొప్పున కేటాయించాలని ఎన్‌‌‌‌ఎంసీని మెడికల్ ఎడ్యుకేషన్‌‌‌‌ డైరెక్టరేట్ కోరింది. గత రెండేండ్లలో 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్‌‌‌‌ఎంసీ.. ఒక్క మంచిర్యాల మినహా ప్రతి కాలేజీకి అడిగినన్ని సీట్లు మంజూరు చేసింది. దీంతో ఈసారి కూడా కాలేజీకి వంద చొప్పున 800 సీట్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ములుగు, నారాయణపేట్ వంటి చిన్న జిల్లాల్లోని కాలేజీల్లో సీట్లకు కోత పెట్టే అవకాశం కూడా ఉందంటున్నారు. 

ఒకవేళ కోత పెట్టినా 600 సీట్లకు తక్కువగాకుండా వస్తాయంటున్నారు. మరోవైపు ఈసారి మరో 3 ప్రైవేటు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కూడా రాష్ట్రం నుంచి ఎన్‌‌‌‌ఎంసీకి దరఖాస్తులు అందాయి. ఈ కాలేజీలు 150 సీట్ల చొప్పున కోరాయి. ఇదివరకే ఉన్న కొన్ని కాలేజీలు సీట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10 వేలు దాటుతుందని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్ అంచనా వేసింది. ఇదే విషయాన్ని ఇటీవల 9 మెడికల్ కాలేజీల ప్రారంభంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కూడా ప్రస్తావించారు. 

70 పీజీ సీట్లకూ అప్లికేషన్..

ప్రస్తుతం రాష్ట్రంలోని కాలేజీల్లో 2,869 పీజీ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లకు పీజీ సీట్లకు పొంతన కుదరడం లేదు. ఈ నేపథ్యంలో పాత మెడికల్ కాలేజీల్లోని పీజీ సీట్ల సంఖ్యను పెంచేందుకు డీఎంఈ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ఏడాది వివిధ కాలేజీల్లో 73 పీజీ సీట్లకు అనుమతి కోరుతూ ఎన్‌‌‌‌ఎంసీకి దరఖాస్తు పంపించారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం గత రెండేండ్లలో ప్రారంభమైన 17 కాలేజీల్లో పీజీ సీట్లు మంజూరు కావాలంటే.. కనీసం ఇంకో రెండేండ్లు ఆగాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.=