గుడ్ న్యూస్: 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

గుడ్ న్యూస్:  1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

 

  • విడుదల చేసిన మెడికల్  రిక్రూట్​మెంట్  బోర్డు 
  • వచ్చే నెల 8 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 1,616 సివిల్  అసిస్టెంట్  సర్జన్  స్పెషలిస్ట్  పోస్టులు, తెలంగాణ రాష్ట్ర రోడ్  ట్రాన్స్‌‌‌‌పోర్ట్  కార్పొరేషన్ (టీజీఎస్ ఆర్టీసీ) హాస్పిటల్‌‌‌‌లో 7 మెడికల్  ఆఫీసర్  స్పెషలిస్ట్  పోస్టులతో కలిపి మొత్తం 1,623 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు మెడికల్  హెల్త్  సర్వీసెస్  రిక్రూట్‌‌‌‌మెంట్  బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) శుక్రవారం నోటిఫికేషన్  విడుదల చేసింది. సెప్టెంబర్ 8 నుంచి 22 సాయంత్రం 5 గంటల వరకు https://mhsrb.telangana.gov.in ద్వారా అప్లికేషన్లు స్వీకరించనున్నారు. అప్లికేషన్  కరెక్షన్స్ కోసం సెప్టెంబర్ 23 నుంచి 24  సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చారు. అప్లికేషన్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే సబ్మిట్​ చేయాలని బోర్డు తెలిపింది. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే, ప్రతి పోస్టుకు విడిగా అప్లికేషన్  పెట్టుకోవాలని సూచించింది.

భర్తీ కానున్న స్పెషలిస్ట్ పోస్టులు ఇవే

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌‌‌‌లో అనస్థీషియా (226), గైనకాలజీ (247), పీడియాట్రిక్స్ (219), జనరల్  మెడిసిన్ (166), జనరల్  సర్జరీ (174), ఆర్థోపెడిక్స్ (89), ఆప్తమాలజీ (38), ఈఎన్‌‌‌‌టీ (54), రేడియాలజీ (71), పాథాలజీ (94), డెర్మటాలజీ (31), సైకియాట్రీ (47), పల్మనరీ మెడిసిన్ (58), ఫోరెన్సిక్  మెడిసిన్ (62), హాస్పిటల్  అడ్మినిస్ట్రేషన్ (24), బయోకెమిస్ట్రీ (8), మైక్రోబయాలజీ (8) పోస్టులు భర్తీ కానున్నాయి. టీజీఎస్ఆర్టీసీ హాస్పిటల్‌‌‌‌లో అనస్థీషియా, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పల్మనరీ మెడిసిన్, రేడియాలజీలలో ఒక్కో పోస్టు భర్తీ చేయనున్నారు.

గ్రామాలకు చేరువకానున్న స్పెషాలిటీ వైద్యం

ఈ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌తో జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్  సెంటర్లలో స్పెషాలిటీ వైద్య సేవలు మెరుగుపడనున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు సైతం అధునాతన వైద్య సేవలు చేరువ కానున్నాయి. ఇప్పటికే ఆరోగ్య శాఖలో 8 వేల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. మరో 7 వేల పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఈ రిక్రూట్మెంట్​ను టీవీవీపీ చరిత్రలోనే అతి పెద్దదిగా గవర్నమెంట్  డాక్టర్స్  అసోసియేషన్  పేర్కొంది. భారీ రిక్రూట్మెంట్  చేపడుతున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి, హెల్త్  మినిస్టర్  దామోదర రాజనర్సింహకు గవర్నమెంట్  డాక్టర్స్  అసోసియేషన్  కృతజ్ఞతలు తెలిపింది.